Bhagavad Gita: Chapter 12, Verse 13-14

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।।
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।।

అద్వేష్టా — ద్వేష భావము లేకుండా; సర్వ-భూతానాం — సమస్త ప్రాణుల పట్ల; మైత్రః — మైత్రీ భావము; కరుణ — కారుణ్యము; ఏవ — నిజముగా; చ — మరియు; నిర్మమః — ప్రాపంచిక వస్తువిషయములపై మమకార/ఆసక్తి లేకుండా; నిరహంకారః — అహంకార రహితముగా; సమ — సమత్వ బుద్ధితో; దుఃఖ — దుఃఖములు/కష్టాలు; సుఖః — సుఖములు; క్షమీ — క్షమాగుణము కలిగి; సంతుష్టః — తృప్తితో ఉంటూ; సతతం — ఎల్లప్పుడూ; యోగీ — భక్తితో ఏకమై; యత-ఆత్మా — ఆత్మ-నిగ్రహము కలిగి; దృఢ-నిశ్చయః — దృఢసంకల్పము/నిశ్చయముతో; మయి — నాకు; అర్పిత — అర్పితము చేసి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; యః — ఎవరైతే; మత్-భక్తః — నా భక్తులు; సః — వారు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైనవారు.

Translation

BG 12.13-14: ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.

Commentary

తన యొక్క సాకార రూపము పట్ల భక్తియే శ్రేష్ఠమని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇప్పుడు 13వ నుండి 19వ శ్లోకం వరకు, తన యొక్క ప్రేమయుక్త భక్తుల లక్షణములను వివరిస్తున్నాడు.

సర్వ భూతముల పట్ల ద్వేషరహితముగా ఉండుట: సమస్త ప్రాణులు కూడా భగవంతుని యొక్క అణు-అంశములని భక్తులు తెలుసుకుంటారు. ఒకవేళ వారు ఇతరుల పట్ల ఈర్ష్యా భావము పెంచుకుంటే అది స్వయంగా భగవంతుని పట్ల ఈర్ష్య పడినట్లే లెక్క. కాబట్టి తమకు హాని చేసే వారిపట్ల కూడా శతృ/ద్వేష భావముతో ఉండరు.

స్నేహపూర్వకంగా మరియు కారుణ్య భావముతో ఉండుట: భక్తి అనేది సమస్త ప్రాణుల పట్ల ఏకత్వ భావమును కలిగిస్తుంది, ఎందుకంటే అవన్నీ కూడా ఒకే భగవంతుని యొక్క బిడ్డలే. భక్తిలో ఇతరులను తన కంటే వేరనే భావనలో చూడటం సమసిపోతుంది. ఇది భక్తులలో దయ/మర్యాదని పెంచుతుంది మరియు ఇతర ప్రాణుల కష్టాల పట్ల సానుభూతిని పెంచుతుంది.

ఆస్తిపాస్తుల పట్ల మమకారాసక్తి లేకుండా, అహంకార రహితముగా ఉండుట: భక్తికి ఉన్న ప్రధాన శత్రువు, గర్వము. నేను-నాది అనే భావనను నిర్మూలించుకుంటేనే వ్యక్తికి ఆధ్యాత్మిక పథంలో పురోగతి లభిస్తుంది. సూక్ష్మబుద్ధిగల భక్తులు సహజంగానే వినయపూర్వకంగా అవుతారు మరియు గర్వమును, యాజమాన్య భావన (ఇది నాది అన్న భావన) ను మరియు తమని తాము ఈ శరీరమే అని తప్పుగా అనుకోవటాన్ని నిర్మూలిస్తారు.

కష్టాల్లో మరియు సుఖాల్లో సమత్వ బుద్ధితో ఉండటం. కేవలం తమ పరిశ్రమ మాత్రమే తమ చేతుల్లో ఉందని, కానీ, తద్వారా వచ్చే ఫలితాలు మాత్రం భగవంతుని చేతిలో ఉన్నాయి అని దృఢ-విశ్వాసంతో ఉంటారు భక్తులు. కాబట్టి ఎలాంటి ఫలితములు వారికి అందినా వాటిని భగవత్ సంకల్పముగా పరిగణిస్తారు మరియు వాటిని సమభావము తో స్వీకరిస్తారు.

ఎల్లప్పుడూ క్షమించే మనస్సుతో ఉండటం. తప్పుచేసిన వారిని, తమ మనోవికారసంతృప్తి కోసం దండించాలని, భక్తులు ఎప్పటికీ కోరుకోరు. ఇతరుల పట్ల ఇటువంటి ప్రతికూల భావనలను మనస్సులో ఉంచుకుంటే మన యొక్క భక్తి నాశనమై పోతుంది. కాబట్టి పరిపక్వమైన భక్తులు తమ మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూరమైన భావనలు ఉంచుకోరు మరియు తప్పు చేసిన వారిని శిక్షించే పని ఆ భగవంతునికే విడిచిపెడతారు.

సర్వదా తృప్తితో ఉండటం. తృప్తి అనేది మనకున్న ఆస్తిపాస్తులను పెంచుకుంటే రాదు, మన కోరికలను తగ్గించుకుంటే వస్తుంది. భక్తులు ఇక భౌతిక వస్తువులలో ఆనందాన్ని వెతుక్కోరు, అందుకే వారికి ఉన్నదానితో తృప్తిగా ఉంటారు.

భక్తితో నాతోనే నిశ్చలముగా ఏకమై ఉండటం. ఇంతకు క్రితం చెప్పినట్లు, ‘యోగము’ అంటే ఏకమైపోవటం. భక్తులు యోగులు అవుతారు ఎందుకంటే వారి అంతఃకరణ భగవంతుని యందే నిమగ్నమై ఉంటుంది. ఈ ఐక్యమగుట (ఏకీభావము) అప్పుడప్పుడూ వచ్చి పోయేది కాదు, అది నిరంతరం ఎడతెగక ఉండేది; ఎందుకంటే వారు భగవంతునితో తమకున్న సంబంధంలో స్థిరముగా ఉంటారు.

ఆత్మనిగ్రహముతో ఉండటం. భక్తులు తమ మనస్సులను ప్రేమయుక్త భక్తితో ఈశ్వరునితో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా అది ప్రపంచం నుండి విడివడుతుంది మరియు వారికి మనోఇంద్రియముల పై అధిపత్యము లభిస్తుంది.

దృఢ నిశ్చయముతో ఉండుట. దృఢ సంకల్పము అనే లక్షణము స్థిరమైన బుద్ధి ద్వారా వస్తుంది. భక్తులు తమ బుద్ధిని శాస్త్రాలలో ఉన్న జ్ఞానముతో మరియు గురువు ఉపదేశములతో అనుసంధానం చేస్తారు, కాబట్టి, అది ఎంత దృఢ నిశ్చయంతో ఉంటుందంటే మొత్తం ప్రపంచం వారిని వేరే విధంగా మార్చటానికి ప్రయత్నించినా వారు ఒక్క ఇసుమంత కూడా తమ స్థానం (నిర్ణయం) నుండి కదలరు.

మనోబుద్దులు నాకు అంకితము చేయబడి ఉండుట. జీవుడు (జీవాత్మ) తన సహజ స్వభావముచే భగవంతుని యొక్క దాసుడు; ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకుంటే, మనం సహజంగానే మనలను ఆ పరమేశ్వరునికి సమర్పించుకుంటాము. ఈ శరణాగతి (సమర్పణ) లో మనోబుద్ధులే ప్రధానమైనవి. వాటిని భగవంతునికి సమర్పణ చేసినప్పుడు, మిగతా దేహమంతా - శరీరము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాపంచిక ఆస్తులు మరియు ఆత్మ - ఇవన్నీ సహజంగానే ఆయన సేవకే అంకితం అయిపోతాయి.

ఈ లక్షణములు ఉండే భక్తులు తనకు చాలా ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.