Bhagavad Gita: Chapter 12, Verse 2

శ్రీ భగవానువాచ ।
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః ।। 2 ।।

శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; మయి — నా యందు; ఆవేశ్యా — నిమగ్నమై; మనః — మనస్సు; యే — ఎవరైతే; మాం — నన్ను; నిత్య యుక్తః — ఎల్లప్పుడూ లగ్నం చేసి; ఉపాసతే — పూజిస్తారో/ఆరాధిస్తారో; శ్రద్ధయా — శ్రద్దా-విశ్వాసములతో; పరాయా — అత్యుత్తమ; ఉపేతః — కలిగియున్న; తే — వారు; మే — నా చేత; యుక్త-తమాః — యోగములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు; మతాః — నేను భావిస్తాను.

Translation

BG 12.2: శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తి లో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.

Commentary

భగవంతుడిని దూరంనుండి, కొంచం దగ్గర నుండి, అతి సమీపం నుండీ, ఇలా ఎన్నో రకాల సమీప స్థాయిలలో అనుభవించవచ్చు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మీరు రైలు పట్టాల పక్కన నిల్చున్నారనుకోండి. ఒక రైలు దూరం నుండి దాన్ని హెడ్ లైటు వేసుకుని వస్తుంటుంది. అది మీకు ఎదో ఒక లైటు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రైలు కొంచెం దగ్గరగా వస్తుందో, ఆ లైటు తో పాటు ఏదో ఒక రూపము చూచాయిగా అగుపిస్తుంది. చివరికి, అది వచ్చి ప్లాటుఫారం మీద ఆగినప్పుడు, మీరు "ఓ! ఇదొక రైలు, దీని కంపార్టుమెంట్ల లోపల కూర్చుని, బయటకు తొంగి చూసే వారందరిని చూడగలుగుతున్నాను" అని తెలుసుకుంటారు. ఇదే ట్రైను దూరం నుండి ఒక లైటు మాదిరి గానే కనిపించింది. అది కొంచం దగ్గరగా వచ్చినప్పుడు లైటుతో పాడు ఏదో కొద్దిగా వెలుగుతున్న ఒక రూపముతో కనిపించింది. అది ఇంకా దగ్గరగా రాగానే అది ఒక రైలు అని మీకు తెలిసి పోయింది. రైలు అదే, కానీ దానికి దగ్గరగా ఉండే కొలదీ దాని యొక్క వివిధ లక్షణములైన - రూపము, రంగు, ప్రయాణీకులు, బోగీలు, తలుపులు మరియు కిటికీల - గురించి మీ యొక్క అవగాహన పెరిగింది.

అదే విధముగా, భగవంతుడు దోషరహితుడు, పరిపూర్ణుడు, మరియు అనంతమైన శక్తులను కలిగి ఉన్నవాడు. ఆయన యొక్క వ్యక్తిత్వము - దివ్య నామములు, రూపములు, లీలలు, గుణములు, పరివారము మరియు ధామములతో - నిండి ఉన్నది. కానీ, ఆయనను విభిన్న సమీప స్థాయిలలో అనుభవించవచ్చు, బ్రహ్మన్ లాగా (భగవంతుని యొక్క నిరాకార సర్వ వ్యాప్త అస్థిత్వము), పరమాత్మ లాగా (సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్న పరమాత్మ, ఇది జీవాత్మ కంటే వేరైనది) మరియు భగవాన్ లాగా ( భూ-లోకమునకు దిగి వచ్చిన భగవంతుని సాకార రూపము).

భాగవతము ఇలా పేర్కొంటున్నది:

వదన్తి తత్తత్త్వవిదస్తత్త్వం యజ్-జ్ఞానమద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే  (1.2.11)

"పరమ సత్యమును ఎరిగిన వారు ఇలా చెప్పారు - ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్త్వము; అదే జగత్తులో మూడు రకాలుగా వ్యక్తమవుతోంది; బ్రహ్మాం, పరమాత్మ మరియు భగవానుడు అనే విధాలుగా". వీరు మూడు వేరు వేరు దేవుళ్ళు కారు; సర్వశక్తిమంతుడైన భగవంతుని యొక్క మూడు రకాల ప్రకటితములు. కానీ, వీరి యొక్క గుణములు భిన్నములు. ఇది ఎలాగంటే, నీరు, నీటిఆవిరి మరియు మంచుగడ్డ ఈ మూడూ కూడా ఒకే హైడ్రోజన్ డయాక్సైడ్ పదార్ధపు అణువులను కలిగి ఉంటాయి - కానీ వాటి యొక్క భౌతిక గుణములు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ బాగా దాహంతో ఉన్న వ్యక్తి నీటి కోసం అడిగితే, అతనికి మనం మంచుగడ్డ ఇస్తే, దానితో అతని దాహం తీరదు. మంచుగడ్డ మరియు నీరు ఒకే పదార్ధమయినా వాటి యొక్క భౌతిక లక్షణములు భిన్నములు. అదే విధముగా, బ్రహ్మాం, పరమాత్మ, మరియు భగవానుడు అనేవారు ఒకే సర్వోన్నత ఈశ్వరుని యొక్క ప్రకటితములు కానీ వాటి వాటి గుణములు భిన్నములు.

బ్రహ్మాం అంటే ఈశ్వరుని యొక్క సర్వ-వ్యాప్త స్వరూపము, ఇది అంతటా ఉంటుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది :

ఏకో దేవః సర్వభూతేషు గూఢ: సర్వవ్యాపీ సర్వ భూతాంతరాత్మా  (6.11)

"ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్వము. ఆయనే అన్నింటిలోపలా మరియు అందరి లోపల కూర్చుని ఉన్నాడు". ఈ యొక్క ఈశ్వరుని యొక్క సర్వ వ్యాప్త అస్థిత్వమునే బ్రహ్మాం అంటారు. అది, నిత్యశాశ్వత తత్వము, జ్ఞానము మరియు ఆనందములతో నిండి ఉన్నది. కానీ, ఈ యొక్క అస్థిత్వములో, భగవంతుడు తన అనంతమైన గుణములను, మనోహరమైన అందమును మరియు మధురమైన లీలలను వ్యక్తపరచడు. ఆయన ఒక దివ్య కాంతి వలె నిర్గుణ (గుణములు లేకుండా), నిర్విశేష (లక్షణములు లేకుండా), నిరాకార (రూపము లేకుండా) అస్థిత్వములో ఉంటాడు.

జ్ఞాన యోగ మార్గమును అనుసరించేవారు ఈ యొక్క అస్థిత్వమునే ఉపాసిస్తారు. ఇది, ఇందాక ఉదాహరణలో రైలుని దూరం నుండి ఒక లైటు లాగా అనుభవించిన మాదిరిగా, ఈశ్వరుడిని నిరాకార కాంతి వలె దూరం నుండి తెలుసుకున్నట్టు ఉంటుంది.

పరమాత్మ అంటే అందరి హృదయములలో కూర్చుని ఉన్న ఈశ్వర స్వరూప తత్త్వము. 18.61వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: "ఓ అర్జునా, ఈశ్వరుడు సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాడు. వారి వారి కర్మలను అనుసరించి, భౌతిక శక్తితో చేయబడిన ఈ యంత్రములలో ఉన్న ఆయా జీవుల (జీవాత్మల), పరిభ్రమణను నియంత్రిస్తాడు." మనలోనే నివసిస్తూ ఈశ్వరుడు మన యొక్క అన్ని తలపులను మరియు కర్మలను నోటు చేసుకుంటాడు, వాటి లెక్క రాసుకుంటాడు మరియు సరియైన సమయములో వాటి ఫలములను అందచేస్తూ ఉంటాడు. మనము ఏమి చేసామో మనము మర్చి పోవచ్చు, కానీ భగవంతుడు మర్చిపోడు. ఆయన మనం పుట్టినప్పటి నుండి మన యొక్క అన్ని తలపులను, మాటలను మరియు చేష్ట లను గుర్తుంచుకుంటాడు. ఇంకా ఈ ఒక్క జన్మ లోనే కాదు! అనంతమైన జన్మలలో, మనం ఎక్కడికి వెళ్లినా, భగవంతుడు మనతోపాటే వెళ్ళాడు. ఆయన ఎంత చక్కటి మిత్రుడంటే మనలను ఒక్క క్షణం కూడా వదలడు. మనలోనే స్థితమై ఉన్న ఈ యొక్క ఈశ్వరుని అస్థిత్వమే పరమాత్మ.

పతంజలి మహర్షి, యోగ దర్శనము లో తెలియపరిచిన అష్టాంగ యోగ మార్గము, మనయందే స్థితమై ఉన్న ఈశ్వరుడిని అనుభవము లోనికి తేవటానికి పరిశ్రమిస్తుంది - అది ఈశ్వరుని యొక్క పరమాత్మ రూప అస్థిత్వమును అనుభవములోనికి తెస్తుంది. ఇందాకటి ఉదాహరణలో, దూరం నుండి లైటు లా కనపడిన రైలు, కాస్త దగ్గరకు రాగానే కొంతమేర వెలిగే రూపముతో కనపడినట్టు, పరమేశ్వర తత్త్వమును పరమాత్మ లాగా తెలుసుకోవటం అనేది నిరాకార బ్రహ్మాం ను కొంత దగ్గరగా తెలుసుకోవటమే.

భగవానుడు అంటే ఈశ్వరుని యొక్క సాకార రూప ప్రకటితము. శ్రీమద్ భాగవతము ప్రకారము:

కృష్ణం ఏనం అవేహి త్వం ఆత్మానం అఖిలాత్మనాం
జగద్-ధితాయ సోఽ ప్యత్ర  దేహీవాభాతి మాయయా (10.14.55)

"పరమాత్మ అయిన పరమేశ్వరుడే, ఈ భూమిపై తన సాకార రూపములో, లోక-సంక్షేమం కోసం శ్రీ కృష్ణుడిలా అవతరించాడు." ఈ యొక్క భగవానుని స్వరూపంలో, ఈశ్వరుడు తన యొక్క నామముల, రూపముల, గుణముల, ధామముల, లీలల మరియు పరివారముల యొక్క సమస్త మాధుర్యమును, వ్యక్త పరుస్తాడు. ఈ యొక్క గుణములు బ్రహ్మం మరియు పరమాత్మ అస్థిత్వములలో కూడా ఉంటాయి, కానీ అవి బయటపడకుండా అంతర్గర్భితమై ఉంటాయి. ఇది ఎలాగంటే, ఒక అగ్గిపుల్లలో అగ్ని దాగి ఉన్నట్టుగా, దాని లోని అగ్ని, పెట్టెకు రాకినప్పుడే వ్యక్తమవుతుంది. అదే విధముగా, భగవానుడి స్వరూపములో, ఈశ్వరుని యొక్క అన్నీ శక్తులు మరియు లక్షణములూ, ఇతర రూపములో అంతర్గర్భితమై ఉన్నటువంటివి, ప్రకటితమవుతాయి.

భక్తి మార్గము అనేది ఈశ్వరుని యొక్క భగవానుని స్వరూపము యొక్క అనుభవమునకు దారి తీస్తుంది. ఇది దేవుని అత్యంత దగ్గరి అనుభవము. ఇందాకటి ఉదాహరణలో, ట్రైను యొక్క వివరములు, అది చూసేవాడి ముందే దగ్గరగా వచ్చి ఆగి ఉన్నపుడు స్పష్టంగా కనిపించినట్టు అన్నమాట. కాబట్టి 18.55వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పేర్కొంటున్నాడు:

"ప్రేమయుక్త భక్తిచే మాత్రమే పరమేశ్వరుడనైన నేను, నేనుగా తెలుసుకోబడుతాను." ఈ విధముగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు, తన సాకార వ్యక్త రూపమును ఆరాధించే భక్తుడే అత్యున్నతమైన యోగి అని వివరణ ఇస్తున్నాడు.