Bhagavad Gita: Chapter 12, Verse 8

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ।। 8 ।।

మయి — నా మీద; ఏవ — మాత్రమే; మనః — మనస్సు; ఆధత్స్వ — లగ్నము చేసి; మయి — నా మీదే; బుద్ధిం — బుద్ధి; నివేశయ — అర్పించి/శరణాగతి చేసి; నివసిష్యసి — నీవు ఎప్పుడూ నివసిస్తావు; మయి — నా లో; ఏవ — మాత్రమే; అతః ఊర్ధ్వం — ఇక ఆ తరువాత; న సంశయః — సంశయము లేదు.

Translation

BG 12.8: నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.

Commentary

సాకార రూపమును ఆరాధించటమే ఉత్తమము అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇక తనను ఎలా ఆరాధించాలో వివరిస్తున్నాడు. అర్జునుడిని రెండు పనులు చేయమంటున్నాడు — మనస్సుని భగవంతుని యందే లగ్నము చేయాలి మరియు బుద్ధిని ఆయనకు అర్పించాలి. మనస్సు యొక్క లక్షణము ఏమిటంటే అది కోరికలను, ఆకర్షణలను, మరియు ద్వేషములను సృష్టిస్తుంటుంది. బుద్ధి యొక్క పని ఆలోచించటం, విశ్లేషించటం, మరియు మంచి-చెడు నిర్ణయించటం.

మనస్సు యొక్క ప్రాముఖ్యత వైదిక శాస్త్రాలలో చాలా చోట్ల చెప్పబడింది:

చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం
గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే (భాగవతం 3.25.15)

‘మాయలో బంధనము లేదా దాని నుండి విముక్తి పొందటం అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అది ప్రాపంచికత్వం పట్ల ఆసక్తితో ఉంటే, వ్యక్తి బంధనములో ఉన్నట్టే, ఒకవేళ మనస్సు ప్రపంచం నుండి విడివడి ఉంటే, వ్యక్తి ముక్తిని పొందుతాడు.’

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః (పంచదశి)

‘బంధనము లేదా మోక్షము అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది.’ కేవలం శారీరక యాంత్రిక భక్తి సరిపోదు; మనస్సుని భగవత్ ధ్యాసలో నిమగ్నం చేయాలి. ఇది ఎందుకంటే, మనస్సును లగ్నం చేయకుండా, కేవలం ఇంద్రియ కార్యక్రమాల వలన ఏమీ లాభము లేదు. ఉదాహరణకి, మనము చెవులతో ఒక ఉపదేశము విన్నాము అనుకోండి, కానీ మన మనస్సు ఏటో వెళ్ళిపోతే, ఏమి చెప్పబడినదో అర్థం కాదు. మాటలు చెవులలో పడతాయి కానీ అవి గుర్తుండవు/అవగతం కావు. దీనివలన మనకు ఏమర్థమవుతుందంటే మనస్సు అనుసంధానం కాకపొతే ఇంద్రియముల పని వ్యర్థమే అని. అదే విధంగా, మనస్సు అనేది ఎలాంటిదంటే దానిలోనే అన్ని ఇంద్రియములు సూక్ష్మ రూపములో ఉంటాయి. అందుకే, ఇంద్రియ కార్యములు లేకున్నా, దృష్టి, వాసన, రుచి, స్పర్శ, మరియు వినికిడి వంటివాటిని తెలుసుకునే గ్రహణశక్తి మనస్సుకు ఉంటుంది. ఉదాహరణకి, రాత్రి పూట మనం నిద్రిస్తున్నప్పుడు మన ఇంద్రియములు అచేతనముగా ఉంటాయి. అయినా కలలు వస్తే, మన మనస్సు ఈ ఇంద్రియ విషయ-వస్తువులను అనుభవిస్తుంది. స్థూల ఇంద్రియములు లేకున్నా మనస్సుకి అన్ని ఇంద్రియ కార్యములు చేసే సామర్థ్యము ఉన్నది, అన్న విషయం దీనితో నిరూపించబడుతున్నది. కాబట్టి, మన కర్మలను నోట్ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు మన మానసిక పనులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ఇంద్రియాలతో చేసే శారీరక పనులకు కాదు.

మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధిని భగవంతుడికి సమర్పణ (శరణాగతి) చేసినప్పుడే మనము భగవంతుని పై మనస్సుని నిలపగలము. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా, మన బుద్ధికన్నా మించిన పరిస్థితి ఎదురైనప్పుడు, మనము మనకన్నా ఎక్కువ వివేకము/బుద్ధి కల వారి మార్గనిర్దేశన అడుగుతాము. ఉదాహరణకి, మనకు వ్యాధి సంక్రమిస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. మనకు వైద్య శాస్త్రము గురించి ఏమీ తెలియదు, కాబట్టి మనము ఒక యోగ్యుడైన వైద్యుడి దగ్గరకు వెళతాము. ఆ వైద్యుడు మన రోగలక్షణములు గమనించి, మన వైద్య పరీక్షల రిపోర్టులు చూసి, రోగనిర్ణయము చేసి మనకు మందులని రాసిస్తాడు. మన బుద్ధిని శరణాగతి చేసి ఆయన రాసిన చీటీ ప్రకారం మందులను తీసుకుంటాము. అదే విధంగా, మనం ఏదైనా న్యాయ వివాదాల్లో చిక్కుకుంటే, ఒక న్యాయవాది సహాయం తీసుకుంటాము. మన న్యాయవాది, మనకు ప్రతిపక్షం తరఫు న్యాయవాది అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నేర్పిస్తాడు. మనకు న్యాయశాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదు కాబట్టి మన బుద్ధిని ఆయనకు అర్పించి ఆ న్యాయవాది చెప్పినట్టుగానే చేస్తాము.

అదే విధముగా, ప్రస్తుతం మన బుద్ధి ఎన్నో దోషాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడిని బృందావనం నుండి మథురకి తీస్కెళ్ళటానికి వెళ్ళిన అక్రూరుడు, ఈ బుద్ధికి ఉన్న దోషాలను శ్రీమద్ భాగవతంలో (10.40.25) లో ఇలా చెప్పాడు: అనిత్యానాత్మ దు:ఖేషు విపర్యయ మతిర్హ్యహం ; అక్రూరుడు ఇలా అన్నాడు: ‘మన బుద్ధి తప్పుడు జ్ఞానంతో ఉన్నది. మనము నిత్య శాశ్వతమైన ఆత్మలమైనా, మనం మనల్ని ఈ నశ్వర శరీరమే అనుకుంటాము. సమస్త ప్రపంచపు వస్తువులన్నీ నశ్వరమైనవే అయినా అవి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి అనుకుంటాము, అందుకే, వాటిని రాత్రీపగలూ పోగుచేసుకుంటాము. ఇంద్రియ భోగముల కోసం పరిశ్రమ అనేది అంతిమంగా దుఃఖహేతువే అయినా, అదేదో ఆనందము లభిస్తుంది అనుకుని వాటి కోసం ప్రయాస పడుతూనే ఉంటాము.’

బుద్ధిలో ఉన్న ఈ మూడు దోషములను విపర్యయములు అంటారు, అంటే భౌతిక మాయ వల్ల అయిన జ్ఞాన నష్టము. అసంఖ్యాకమైన పూర్వ జన్మలలో మన బుద్ధి చేసిన ఈ దోషపూరిత చింతన వలన మన సమస్య యొక్క తీవ్రత మరింత జఠిలమవుతున్నది. మన జీవితాలను మన బుద్ధి చెప్పిన ప్రకారం నడిపించుకుంటే మనం ఖఛ్చితంగా ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోలేము. ఈ విధంగా, మనం మనస్సుని భగవంతుని యందే అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించాలనుకుంటే, మనం బుద్ధిని ఆయనకు సమర్పించి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. బుద్ధిని సమర్పించటం అంటే, శాస్త్రములు మరియు ప్రామాణిక గురువుల ద్వారా, భగవంతుని నుండి లభించిన జ్ఞానము ప్రకారం చింతన/ఆలోచన చేయటం. శరణాగతి చేసిన బుద్ధి యొక్క లక్షణములు 18.62వ శ్లోకంలో వివరించబడ్డాయి.