Bhagavad Gita: Chapter 5, Verse 2

శ్రీ భగవానువాచ ।
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।

శ్రీ భగవానువాచ — భగవంతుడు ఇలా పలికెను; సన్యాసః — సన్యాసము; కర్మ-యోగః — భక్తితో పని చేయటము; చ — మరియు; నిఃశ్రేయస-కరౌ — అత్యున్నత లక్ష్యం వైపు తీసుకెళ్లును; ఉభౌ — రెండూ; తయో — ఈ రెంటిలో; తు — కానీ; కర్మ-సన్యాసాత్ — కర్మ సన్యాసము కంటే; కర్మ-యోగః — భక్తితో పనిచేయటం; విషిశ్యతే — ఉన్నతమైనది.

Translation

BG 5.2: భగవానుడు పలికెను: కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.

Commentary

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసమును మరియు కర్మ యోగమును పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన/గంభీరమైన శ్లోకం; కాబట్టి దీనిని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం.

ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలని రెంటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడుతాయి. జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:

సోచు మన యహ కర్మ మమ సబ లఖత హరి గురు ప్యారే

(సాధన భక్తి తత్త్వ)

‘ఓ ప్రియ సాధకుడా! ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను, గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించుము.’ ఇదే కర్మ యోగ సాధన, దీనితో మనల్ని మనం క్రమక్రమముగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు.

కర్మ సన్యాసము అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసము. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే (భగవత్ సేవ) నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామ చంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు, ఈ కర్మ సన్యాస భావము లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది:

మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ

(రామచరితమానన్)

 

లక్ష్మణుడు రామునితో అన్నాడు, ‘నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి, మరియు నా సర్వస్వమూ నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయాశక్తులా నిర్వర్తిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాల్ని నాకు చెప్పవద్దు.’

కర్మ సన్యాసం అభ్యాసం చేసే వారు తమని తాము శరీరము అనుకోరు, తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు, ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు, కానీ కర్మ యోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు.

కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు మరియు అర్జునుడికి దానినే అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యములను త్యజించిన పిదప తమ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటూ ఇటూ కాకుండా పోతారు. భారత దేశంలో, ఇటువంటి, ఎన్నోవేల మంది సాధువులు, తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు, కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి, ఏదో బైరాగులు ధరించే కాషాయి వస్త్రాలు ధరించినా, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు.

మరో పక్క, కర్మ యోగులు, ప్రాపంచక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకి తప్పితే, కనీసం వారి వృత్తి/పని మీద ఆధార పడవచ్చు. ఈ విధంగా కర్మ యోగము అనేది అత్యధిక జనులకు సురక్షితమైన మార్గము; అదే సమయంలో, సమర్థుడైన గురువు గారి పర్యవేక్షణ లోనే కర్మ సన్యాస మార్గమును అవలంబించాలి.