Bhagavad Gita: Chapter 5, Verse 6

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్ఛతి ।। 6 ।।

సన్యాసః — సన్యాసము; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; దుఃఖమ్ — దుఃఖము; ఆప్తుమ్ — పొందును; అయోగతః — కర్మ యోగము లేకుండా; యోగ-యుక్తః — కర్మ యోగములో ప్రవీణుడు; మునిః — ముని; బ్రహ్మ — బ్రహ్మన్; న చిరేణ — త్వరితముగా; అధిగచ్ఛతి — చేరును.

Translation

BG 5.6: భక్తి యుక్తముగా పని చేయకుండా (కర్మ యోగము) పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము, ఓ గొప్ప బాహువులు కలవాడా, కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును.

Commentary

హిమాలయాల గుహలలో నివసించే ఓ యోగి, తాను జగత్తునుండి సన్యసించినట్టు భావించవచ్చు, కానీ, అతను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అతని సన్యాసము యొక్క నిజమైన పరీక్ష చేయబడుతుంది. ఉదాహరణకి, ఒక సాధువు పన్నెండు సంవత్సరాలు గర్హ్వాల్ పర్వతాలలో నియమనిష్ఠలను అభ్యాసం చేసాడు. ఒకసారి అతను కుంభమేళాలో పాల్గొనటానికి హరిద్వార్ వచ్చాడు. ఆ కుంభమేళా హడావిడిలో ఎవరో ఒక అతను పొరపాటున తన చెప్పుతో ఉన్న కాలిని ఆ యోగి పాదాలపై ఉంచాడు. ఆ సాధువు కోపంతో ఊగిపోయి, ఇలా అరిచాడు ‘ఏంటి గుడ్డి వాడివా? ఎక్కడకి పోతున్నావో చూసుకోలేవా?’ అని. తరువాత కోపానికి తాను వశమైపోయినందుకు ఇలా చింతించాడు, ‘పన్నెండేళ్లు కొండలలో నియమనిష్ఠలతో చేసిన అభ్యాసం, ఒక్క రోజు నగరంలో ఉండటం వలన వృధా అయిపోయింది’ అని. ఈ ప్రపంచమే, మన సన్యాసం పరీక్షించబడే రంగ స్థలం.

ఈ లోకంలో తన ధర్మములు నిర్వర్తిస్తూ ఉండి, వ్యక్తి క్రమక్రమంగా కోపము, లోభము, మరియు కామములకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించాలి, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇలాకాక, ఎవరైనా తన విధులను త్యజిస్తే, మనస్సును పరిశుద్దం చేసుకోవటం చాలా కష్టం; మరియు పరిశుద్ధమైన మనస్సు లేకుండా నిజమైన వైరాగ్యం సుదూరపు స్వప్నంగానే మిగిలిపోతుంది.

మనమందరమూ మన సహజ స్వభావంచే పని చేయటానికి ప్రేరేపింపబడుతాము. అర్జునుడు ఒక యోధుడు, కానీ, కృత్తిమంగా తన ధర్మమును త్యజించి, అడవులకు పారిపోతే, అతని స్వభావం అక్కడ కూడా పనిచేపిస్తుంది. బహుశా ఎవరో కొంత మంది గిరిజనులను పోగుచేసి వారికి తానే రాజును అని ప్రకటించుకుంటాడేమో. బదులుగా, తన సహజ గుణాలని, ప్రతిభని భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే అది ఏంతో ఫలదాయకంగా ఉంటుంది. కాబట్టి, భగవంతుడు అతనికి ఇలా ఉపదేశిస్తున్నాడు, ‘యుద్ధం కొనసాగిస్తూనే ఉండు, కానీ ఒక్క మార్పు చేయుము. మొదట్లో నీవు రాజ్య కాంక్షతో ఈ యుద్ధ భూమికి వచ్చావు. ఇప్పుడు దానికి బదులుగా నీ సేవని నిస్వార్థముగా ఆ భగవంతుకే అర్పించుము. ఈ విధముగా, నీవు సహజంగానే నీ మనస్సుని పవిత్రం చేసుకుని, నిజమైన అంతర్గత సన్యాసమును సాధించవచ్చు.’

పిందెగా మరియు కచ్చగా ఉన్న పండు, తనను మోసి, పోషించే చెట్టుకి గట్టిగా అతుక్కుని ఉంటుంది. అదే పండు, పూర్తిగా పండినప్పుడు, తనకు ఆధారంగా ఉన్న దాని నుండి విడిపోతుంది. అదే విధంగా, సంపూర్ణ విజ్ఞానంగా పరిపక్వత చెందే అనుభవం, కర్మ యోగికి, ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసినవారికే గాఢ నిద్ర పడుతుందో, కర్మ యోగము ద్వారా మనస్సుని పరిశుద్ధమొనర్చుకున్నవారికే గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది.