Bhagavad Gita: Chapter 5, Verse 11

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ।। 11 ।।

కాయేన — శరీరంతో; మనసా — మనస్సుతో; బుద్ధ్యా — బుద్ధితో; కేవలైః — కేవలము; ఇంద్రియైః — ఇంద్రియములతో; అపి — కూడా; యోగినః — యోగులు; కర్మ — కర్మలు; కుర్వంతి — చేయుదురు; సంగం — సంగము (మమకార ఆసక్తులు); త్యక్త్వా — విడిచిపెట్టి; ఆత్మ— ఆత్మ; శుద్ధయే — శుద్ధి కొరకు.

Translation

BG 5.11: యోగులు, మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

Commentary

ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృధా ప్రయాసే అని యోగులు అర్థం చేసుకుంటారు. దీనిని వాస్తవంగా ఎఱింగి, వారు స్వార్థ కోరికలను త్యజించి, అన్ని కర్మలూ భగవత్ ప్రీతి కోసమే చేస్తారు, కేవలం ఆయనే 'భోక్తారం యజ్ఞ తపసాం' (అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త). కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, సమర్పణ (భగవంతునికి అంకితం చేయటం) అంటే ఒక కొత్త దృక్కోణం చూపిస్తున్నాడు. జ్ఞానోదయమైన యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసము మాత్రమే కర్మలు చేస్తుంటారు అంటున్నాడు. మరి ఇక ఏ విధంగా కర్మలు భగవంతునికి అంకితం చేసినట్టు?

నిజానికి భగవంతునికి మన నుండి ఏమీ అక్కరలేదు. ఆయనే సర్వలోక నాయకుడు, సమస్త లోకాలకు ప్రభువు, దోషరహితుడు, తనకు తానే పరిపూర్ణుడు. ఒక అత్యల్ప జీవాత్మ, భగవంతునికి, ఆయన దగ్గర లేనిది, ఇచ్చేది ఏముంది? కాబట్టి, ఏదైనా భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు, ఇలా చెప్పే సాంప్రదాయం ఉంది: త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితం; ‘ఓ భగవంతుడా, నీ వస్తువునే నీకు తిరిగి సమర్పిస్తున్నాను.’ ఇటువంటి భావనే వ్యక్తం చేస్తూ యోగి యమునాచార్య ఇలా పేర్కొన్నాడు :

మమ నాథ యద్ అస్తి యో ఽస్మ్యహం

సకలం తద్ధీ తవైవ మాధవ
నియత-స్వం ఇతి ప్రబుద్ధ-ధైర్ అథ వా

కిం ను సమర్పయామి తే (శ్రీ స్తోత్ర రత్న, 50)

 

‘లక్ష్మీ దేవి నాథుడైన ఓ విష్ణుమూర్తి, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు, నేను నీకు చాలా ఇద్దామనుకున్నాను. కానీ, జ్ఞానం పెంపొందించుకున్న తరువాత నా దగ్గర ఉన్నదంతా నీదే అని తెలుసుకున్నాను. నేను నీకు ఇక ఏమి ఇవ్వగలను?’

కానీ, ఒక వ్యవహారం మాత్రం భగవంతుని చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది; అదే మన అంతఃకరణ శుద్ది (మనస్సు-బుద్ధిలను పవిత్రమొనర్చు కోవటం). మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దానిని భక్తిలో నిమగ్నం చేస్తే, అదే భగవంతునికి ఏ ఇతర దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు, తమ అంతఃకరణ శుద్ధిని అతిముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు; దీనిని స్వార్థం కోసం కాకుండా, భగవత్ ప్రీతి కోసమే చేస్తారు.

ఈ విధంగా యోగులు, భగవంతునికి తాము ఇవ్వగలిగే అత్యంత విలువైనది తమ హృదయ పవిత్రతయే అని అర్థం చేసుకుని, ఆ దిశగా దాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు. రామాయణంలో ఈ సూత్రాన్ని విశదీకరిస్తూ ఒక అందమైన దృష్టాంతము ఉంది.

లంకా యుద్ధానికి ముందు సుగ్రీవుడు ఏదో భయపడుతున్నట్టు రామచంద్ర ప్రభువుకి అనిపించింది, అందుకు అతనిని ఇలా ఆ ప్రభువు ఊరడించాడు:

పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్
అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చాన్ హరిగణేశ్వరః

(వాల్మీకి రామాయణం)

 

శ్రీ రామ చంద్ర ప్రభువు ఇలా అన్నాడు, ‘నేనే గనక నా ఎడమ చేతి చిటికిన వ్రేలిని కొద్దిగా వంచితే, రావణుడు, కుంభకర్ణుడు ఏమిటి, లోకంలో సమస్త రాక్షసులు మరణిస్తారు.’

సుగ్రీవుడు ఇలా బదులిచ్చాడు, ‘అలాగైతే ప్రభూ, రావణాసురిడిని చంపటానికి ఈ సైన్యాన్ని అంతా పోగు చేయటం ఏం అవసరం?’ అని.

శ్రీ రామచంద్రుడు ఇలా బదులిచ్చాడు, ‘అది కేవలం మీ చిత్త శుద్ధి కోసం, మీకందరికీ భక్తియుక్త సేవ చేసుకోవటం కోసం ఒక అవకాశం ఇవ్వటం కోసమే. అందుకే, ఈ రాక్షసులని సంహరించటం కోసం మీ సహాయం నాకు అవసరం అని అనుకోవద్దు.’

మనకు శాశ్వతంగా ఉండే ఒకే ఒక సంపద మనం సాధించే చిత్తశుద్ది/పవిత్రత మాత్రమే. అది మనతో పాటు తదుపరి జన్మకు వెళుతుంది, అదే సమయంలో భౌతిక సంపదలు అన్నీ ఇక్కడే విడిచిపెట్టబడుతాయి. కాబట్టి అంతిమ పరీక్షలో జీవితంలో గెలుపు, ఓటమి అనేవి మనం ఎంత అంతఃకరణ శుద్ధి సాధించామా అన్న దాని చేత నిర్ణయింపబడుతాయి. ఈ దృక్పథంలో ఉన్నతమైన యోగులు, ప్రతికూల పరిస్థితులను కూడా ఆహ్వానిస్తారు, ఎందుకంటే అవి తమ అంతఃకరణ శుద్ధి కోసం వచ్చే అవకాశాలుగా పరిగణిస్తారు. సంత్ కబీర్ ఇలా అన్నాడు:

నిందక్ నియరే రాఖియే ఆంగన్ కుటి ఛబాయ
నిత సాబున్ పానీ బినా నిర్మల కరే సుభాయ

‘నీవు నీ మనస్సుని త్వరగా శుద్ధి చేసుకోవాలనుకుంటే, ఒక విమర్శకున్ని దగ్గరే ఉంచుకో. అతని పరుషమైన మాటలు సహించినప్పుడు, నీ హృదయం సబ్బు, నీరు లేకుండానే శుద్ధి చేయబడుతుంది.’ ఈ విధంగా, అంతఃకరణ శుద్ధియే మన కర్మల ప్రధాన ఉద్దేశం అయినప్పుడు, ప్రతికూల పరిస్థితులు, మన పురోగతికోసం, భగవంతుడే పంపించిన అవకాశాలని స్వీకరించబడుతాయి; మరియు జయము, అపజయములలో సమత్వ భావనతో ఉంటాము. మనం భగవంతుని ప్రీతి కోసమే పనులు చేస్తాము కాబట్టి, మనస్సు పరిశుద్ధమౌతుంది, మనస్సు పరిశుద్ధమయిన కొద్దీ సహజంగానే మన కర్మ ఫలితములను భగవత్ అర్పితము చేస్తాము.