Bhagavad Gita: Chapter 9, Verse 29

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।। 29 ।।

సమః — సమానముగా; అహం — నేను; సర్వ-భూతేషు — సమస్త ప్రాణుల యందు; న — ఎవరూ కాదు; మే — నాకు; ద్వేష్యః — విరోధులు; అస్తి — ఉండును; న — కాదు; ప్రియః — ఇష్టమైన వారు; యే — ఎవరైతే; భజంతి — ప్రేమతో ఆరాధించేవారు; తు — కానీ; మాం — నన్ను; భక్త్యా — భక్తితో; మయి — నా యందే నివసిస్తారు; తే — అటువంటి జనులు; తేషు — వారి యందు; చ — మరియు; అపి — కూడా; అహం — నేను.

Translation

BG 9.29: నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.

Commentary

దేవుడనేవాడు ఉంటే ఆయన సంపూర్ణ దోషరహిత న్యాయమూర్తిగా ఉంటాడని మనందరమూ అంతర్లీనంగా నమ్ముతాము; అన్యాయమైన భగవంతుడు ఉండలేడు. లోకంలో అన్యాయంచే పీడించబడేవారు ఇలాంటి మాటలు అంటుంటారు , ‘ఓ, కొటీశ్వరుడా, నీ దగ్గర ధన బలం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మన వివాదాన్ని భగవంతుడే పరిష్కరిస్తాడు. ఆయన అంతా చూస్తున్నాడు, నిన్ను తప్పక దండిస్తాడు. నీవు తప్పించుకోలేవు.’ అని. ఇటువంటి మాటలు వింటే, ఆ చెప్పేవాడు, భగవంతుని మీద అత్యంత దృఢ విశ్వాసం ఉన్న ఋషి/ముని కాకపోయినా, సామాన్య మానవులకు కూడా భగవంతుడు సంపూర్ణ న్యాయమైన వాడు అని గట్టి నమ్మకం ఉందని తెలుస్తుంది.

కానీ, శ్రీ కృష్ణుడు చెప్పిన ఇంతకు క్రితం శ్లోకం, భగవంతుడు తన భక్తుల పట్ల పక్షపాతంతో ఉంటాడా అన్న సందేహాన్ని కలుగ చేస్తుంది; ఎందుకంటే, మిగతా అందరూ కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటే, భగవంతుడు తన భక్తులను దాని నుండి విముక్తి చేస్తాడు. ఇది మరి ఆయన పక్షపాత దోషానికి సూచిక కాదా? శ్రీ కృష్ణుడు దీనిని స్పష్టపరచాలానే ఉద్దేశంతో, ఈ శ్లోకాన్ని 'సమోఽహం' అన్న పదంతో మొదలు పెడుతున్నాడు, అంటే, ‘లేదు లేదు నేను అందరి పట్ల సమంగా ఉంటాను, కానీ, నా దగ్గర అందరికీ సమానంగా వర్తించే చట్టం ఉంది, దాని పరంగానే నేను నా కృపని ప్రసాదిస్తాను’ అని. ఈ సూత్రం, ఇంతకూ క్రితం 4.11వ శ్లోకంలో చెప్పబడింది: ‘నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే, ఓ అర్జునా.’

వాన నీరు భూమిపై సమానంగా పడుతుంది. అయినా, వ్యవసాయ క్షేత్రాలలో పడే బిందువు, ధాన్యంగా మారుతుంది; ఎడారి ముళ్లపొదపై పడే బిందువు ముల్లుగా మారుతుంది; మురుగు గుంటలో పడే బిందువు మురుగు నీరు అవుతుంది; మరియు ఆల్చిప్పలో పడే బొట్టు, ముత్యంగా మారుతుంది. పడే వానకి ఎలాంటి పక్షపాతం లేదు, అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి వాన బిందువులు బాధ్యత కాదు, వాటిని అందుకునే వాటి క్షేత్ర స్వభావాల్లో తేడాయే కారణం. అదే విధంగా, భగవంతుడు ఇక్కడ అనేదేమిటంటే, ఆయన సమస్త ప్రాణుల యందు సమానమైన కృప చూపిస్తున్నాడు, అయినా, ఆయనను ప్రేమించని వారు, వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచే ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకున్నారు. మరైతే, మనస్సులు అపవిత్రంగా ఉన్న వారు ఏమి చేయవచ్చు? శ్రీ కృష్ణుడు ఇక తదుపరి భక్తి యొక్క పవిత్రమొనర్చే శక్తిని తెలియచేస్తున్నాడు.