Bhagavad Gita: Chapter 9, Verse 18

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ।। 18 ।।

గతిః — సర్వోత్కృష్ట లక్ష్యము; భర్తా — భరించు/పోషించు వాడను; ప్రభుః — ప్రభువు; సాక్షీ — సాక్షి; నివాసః — నివాసము; శరణం — ఆశ్రయము; సు-హృత్ — స్నేహితుడు; ప్రభవః — మూల ఉత్పత్తి స్థానం; ప్రలయః — లయము; స్థానం — నివాస స్థానము; నిధానం — విశ్రాంతి స్థలము; బీజం — విత్తనము; అవ్యయమ్ — నాశము చెందనిది.

Translation

BG 9.18: నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము; నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును.

Commentary

ఆత్మ అనేది భగవంతుని యొక్క అణు-అంశము కాబట్టి, దాని యొక్క అన్ని అనుబంధాలూ/సంబంధాలూ ఆయనతోనే. కానీ, భౌతిక శారీరక దృక్పథంలో, మన శారీరక సంబంధీకులనే మనము తండ్రి, తల్లి, సఖి/సఖుడు, బిడ్డ మరియు స్నేహితుడు అని అనుకుంటాము. వారి పట్ల మమకార ఆసక్తులతో వారినే పదేపదే మన మనస్సులోకి తెస్తాము, దీనితో భౌతిక దృక్పథంలో మరింత బంధించివేయబడుతాము. కానీ, ఈ ప్రాపంచిక బంధువులు ఎవ్వరూ కూడా మనకు, మన ఆత్మ పరితపించే దోషరహిత సంపూర్ణ ప్రేమను ఇవ్వలేరు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటగా, ఈ అనుబంధాలు తాత్కాలికమైనవి, మరియు మనం వెళ్లిపోయినప్పుడో లేదా వారు వెళ్ళిపోయినప్పుడో, విడిపోవటం అనేది తప్పదు. రెండోది, వారు బ్రతికున్నంత కాలం కూడా, ఆ అనుబంధం స్వార్థంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది స్వార్థ ప్రయోజనం నేరవేరినంత మేర ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఈవిధంగా, ప్రాపంచిక ప్రేమ యొక్క గాఢత మరియు పరిధి రోజంతా అనుక్షణం మారుతూ ఉంటుంది. ‘నా భార్య చాలా మంచిది... అంత మంచిది కాదు.... ఫరవాలేదులే ... ఆమె ఇంత ఘోరమా’, ఇలా, జగన్నాటకములో ప్రాపంచిక ప్రేమ యొక్క చాంచల్యము ఇంతగా ఉంటుంది. మరో పక్క, భగవంతుడు జన్మ జన్మల నుండి మనతోనే ఉన్న బంధువు. ఒక జన్మ నుండి ఇంకో జన్మకి, ఏ జీవరాశి రూపంలో ఉన్నా, భగవంతుడు మనతోపాటే ఉన్నాడు మరియు మన హృదయంలోనే స్థితమై ఉన్నాడు. అందుకే ఆయన మన శాశ్వత బంధువు. అంతేకాక, ఆయనకు మననుండి ఏమీ స్వప్రయోజనము అవసరం లేదు; ఆయనే దోషరహితుడు మరియు సంపూర్ణుడు. ఆయన మనలను నిస్వార్థంగా ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన కేవలం మన శాశ్వత సంక్షేమం మాత్రమే కోరేవాడు. అందుకే శాశ్వతుడు, నిస్వార్థుడూ అయిన భగవంతుడు మాత్రమే మన నిజమైన బంధువు.

ఈ విషయాన్ని మరో దృక్కోణం నుండి అర్థంచేసుకోవాలంటే, సముద్రము మరియు దాని నుండి వచ్చే అలలను ఉపమానంగా చూడండి. రెండు ఒకదానిచెంతనే ఉన్న అలలు కలిసి కొంతకాలం ప్రయాణిస్తాయి, మరియు ఏదో గాఢమైన అనుబంధము ఉన్నట్లుగా, ఉల్లాసముగా ఒకదానితో ఒకటి ఆడుకుంటాయి. కానీ, కొంచెం దూరం వెళ్ళిన తరువాత, ఒకటి సముద్రం లోనికి జారిపోతుంది, మరికాసేపట్లో ఇంకోటి కూడా కలిసిపోతుంది. వాటికి తమ మధ్యలో ఏదైనా అనుబంధం ఉందా? లేదు, అవి రెండూ సముద్రం నుండి జనించాయి మరియు వాటి సంబంధం సముద్రము తోనే. ఇదే విధంగా, భగవంతుడు ఒక సముద్రం వంటి వాడు మరియు మనమందరమూ దాని నుండి ఉద్భవించే అలలము. మనము మన శారీరక సంబంధీకులపై అనురాగం పెంచుకుంటాము; కానీ మరణ సమయంలో అందరిని విడిచి తదుపరి జన్మలోకి ఒంటరిగానే వెళ్తాము. యదార్థమేమంటే, జీవాత్మలకు ఒకదానితో ఇంకోదానికి సంబంధము లేదు, కేవలం భగవంతునితోనే ఉంది; మనమందరమూ ఎక్కడ నుండీ జనించామో, ఆ పరమేశ్వరుడితోనే.

ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు మనలను శారీరక దృక్పథం మరియు దానితోపాటుగా వచ్చే ప్రాపంచిక బంధువుల పట్ల అనురాగం భావముల నుండి పైకి తీసుకువస్తున్నాడు. ఆత్మ కోణం నుండి చూస్తే, భగవంతునితోనే మనకు అన్నీ సంబంధాలు; ఆయనే మన స్నేహితుడు, తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, మరియు సఖి/సఖుడు. ఈ విషయం అన్ని వేద శాస్త్రాలలో చెప్పబడింది.

దివ్యో దేవ ఏకో నారాయణో మాతా పితా భ్రాతా సుహృత్ గతిః
నివాసః శరణం సుహృత్ గతిర్ నారాయణా ఇతి

(సుబాల శృతి, 6వ మంత్రము)

‘శ్రీమన్నరాయణుడే, జీవుని యొక్క - అమ్మ, నాన్న, సఖి/సఖుడు, మరియు గమ్యము’

మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామి

(రామచరితమానస్)

‘ఓ శ్రీ రామచంద్ర ప్రభూ, నీవే నా స్వామివి, పతితపావనుడివి, మరియు హృదయము తెలిసినవాడివి.’ భగవంతునితో మనకున్న నిత్య సంబంధము యొక్క పరిమాణము తెలుసుకున్న తరువాత మనము మన మనస్సుని ఆయన యందే అనుసంధానం చేయటానికి పరిశ్రమించాలి. దానిచే, మనస్సు పవిత్రం చేయబడుతుంది మరియు మనం ‘మామేకం శరణం వ్రజ’ అన్నటువంటి పూర్తి శరణాగతి షరతుని నెఱవేర్చినట్టు అవుతుంది; ఇది భగవత్ కృపని ఆకర్షించటానికి ఆవశ్యకమైనది. ఈ యొక్క అనన్య సంకల్పము సాధించటానికి మన ప్రస్తుత మమకారాసక్తులను అన్నింటిని ఖండించాలి మరియు వాటి స్థానాన్ని భగవత్ అనుబంధముచే భర్తీచేయాలి. అందుకే, రామచరితమానస్ ప్రకారం:

సబ కై మమతా తాగ బటోరీ,

మమ పద మనహి బాంధ బరి డోరీ

‘మనస్సుకి ఉన్న సమస్త ప్రాపంచిక అనుబంధాల తాళ్ళని ఖండించి వేయుము; ఆ తాళ్ళతో ఒక తాడు తయారు చేసి, దానిని భగవత్ చరణారవిందము వద్ద కట్టివేయుము.’ మన మనస్సుని ఆయనకు కట్టి వేయటానికి సహాయపడటానికి, ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఆత్మ యొక్క సర్వ-సంబంధములు భగవంతునితోనే అని అర్జునుడికి చెప్తున్నాడు.