Bhagavad Gita: Chapter 9, Verse 27

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।।

యత్ — ఏదైనా సరే; కరోషి — నీవు చేసేది; యత్ — ఏదైతే; అశ్నాసి — నీవు భుజిస్తావో; యత్ — ఏదైతే; జుహోషి — యజ్ఞాగ్నిలో సమర్పిస్తావో; దదాసి — బహుమతిగా ఏది దానం (బహూకరించుట) చేసినా; యత్ — ఏదైతే; యత్ — ఏదైనా; తపస్యసి — ఆచరించే తపస్సులను; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; తత్ — వాటిని; కురుష్వ — చేయుము; మద్ అర్పణం — నాకు సమర్పించినట్టుగా.

Translation

BG 9.27: నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.

Commentary

ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు అన్ని పదార్థాలను తనకు అర్పించమన్నాడు. ఇక ఇప్పుడు అన్ని పనులను/క్రియాకలాపములను తనకే అర్పించమంటున్నాడు. ఏ సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్థరహిత పానీయాలని త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలు ఆచరిస్తున్నా, ఏ వ్రతాలు, నిష్ఠలు ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి. తరచుగా జనులు భక్తిని దైనందిన జీవితం కంటే వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే వేరేగా కేవలం గుడి లోపలే చేయాలి అనుకుంటారు. కానీ, భక్తి అనేది గుడి లోపల మాత్రమే చేసేది కాదు; అది జీవితం లోని ప్రతి క్షణం ఆచరింవలసినదే.

నారద మహర్షి భక్తిని ఈ విధంగా నిర్వచించాడు:

నారదస్తు తదర్పితా ఖిలాచారతా తద్విస్మరణే పరమవ్యాకులతేతి
(నారద భక్తి దర్శనము, 19వ సూత్రము)

‘భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే.’ పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చివేస్తే దానినే అర్పణం అంటారు. ఇటువంటి దృక్పథం, భౌతికమైన ప్రాపంచిక పనులను, దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా మార్చివేస్తుంది. స్వామీ వివేకానంద, పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: ‘ఏ పనీ లౌకికమైనది కాదు. ప్రతీదీ భక్తి మరియు సేవయే’ (No work is secular. Everything is devotion and service.)

సంత్ కబీర్ ఇదే విషయాన్ని తన పద్యాల్లో చెప్పాడు:

జహాఁ జహాఁ చలూఁ కరూఁ పరిక్రమా, జో జో కరూఁ సో సేవా

జబ సోఁవూ కరూఁ దండవత్, జానూఁ దేవ న దూజా

‘నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.’ చాలా మంది జనులు ఈ క్రింది శ్లోకాన్ని, దాని మహత్వం తెలియకుండానే దేవాలయాల్లో ఈ శ్లోకం పఠిస్తారు:

కాయేన వాచా మనసేంద్రియైర్ వా

బుద్ధ్యాత్మనా వానుసృత-స్వభావాత్
కరోతి యద్ యత్ సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయేత్ తత్ (భాగవతం 11.2.36)

‘శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, లేదా బుద్ధితో కానీ, తన వ్యక్తిగత స్వభావం అనుగుణంగా, చేసే వాటన్నిటినీ, శ్రీమన్నారాయణుడికే అర్పించాలి.’ కానీ, ఈ సమర్పించటం, అంతా పని అయిపోయిన తరువాత, వైదిక క్రతువులలో చేసినట్టు ‘శ్రీ కృష్ణాయ సమర్పణమస్తు’ అని అనటం ద్వారా చేయటంకాదు. ఆ సమర్పణ అనేది పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్న అంతర్గత భావనతో చేయాలి. అన్ని కార్యకలాపములను తనకే అర్పించమని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు అలా చేయటం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక వివరిస్తున్నాడు.