Bhagavad Gita: Chapter 9, Verse 13

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ।। 13 ।।

మహా-ఆత్మానః — మాహాత్ములు; తు — కానీ; మాం — నన్ను; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; దైవీం-ప్రకృతిం — దివ్య శక్తి; ఆశ్రితాః — ఆశ్రయింతురు; భజంతి — భక్తిలో నిమగ్నమౌదురు; అనన్య-మనసః — అనన్య చిత్తముతో; జ్ఞాత్వా — తెలుసుకొని; భూత — సమస్త సృష్టి; ఆదిమ్ — ఆది మూలము; అవ్యయమ్ — నశించిపోనిది.

Translation

BG 9.13: కానీ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది-మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.

Commentary

శ్రీ కృష్ణుడి ఉపదేశ విధానం ఎలా ఉంటుందంటే, ఒక విషయం గట్టిగా చెప్పాలంటే, పూర్తి విరుద్ధమైన ఉపమానములు చూపిస్తాడు. మోహమునకు గురై, భ్రమకు లోనైన వారి గురించి వివరించిన పిదప ఇక ఇప్పుడు మహాత్ముల గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక ప్రాపంచిక జీవితం అనేది, మాయా (భౌతిక శక్తి) మోహితులై నిద్ర పోయేవారు అనుభూతిచెందే ఒక దీర్ఘమైన కల. వీరితో పోల్చితే, తమ అజ్ఞానం నుండి మేల్కొని, భౌతిక దృక్పథాన్ని ఒక పీడ-కల లాగా ప్రక్కకి తోసివేసిన వారే మహాత్ములు అంటే. భౌతిక శక్తి, మాయ, పట్టు వీడిపోయి, వారు ఇప్పుడిక దివ్య యోగమాయ శక్తి ఆశ్రయంలో ఉన్నట్టు. ఇటువంటి జ్ఞానోదయమైన మహాత్ములు, భగవంతునితో తమకున్న నిత్య సంబంధము యొక్క ఆధ్యాత్మిక యదార్థాన్ని గుర్తించినవారు.

ఎలాగైతే భగవంతునికి రెండు రకాల అస్తిత్వములు ఉన్నవో — నిరాకార తత్త్వము మరియు సాకార రూపము — ఆయన యోగమాయ శక్తికి కూడా రెండు అస్తిత్వములు ఉంటాయి. అదొక నిరాకార శక్తి, కానీ అది కూడా, ఒక సాకార స్వరూపంలో రాధ, సీత, దుర్గ, లక్ష్మి, కాళి, పార్వతి మొదలగు రూపాల్లో వ్యక్తమవుతుంది. ఎలాగైతే, కృష్ణుడు, రాముడు, శివుడు, నారాయణుడు మొదలైనవారంతా ఒకే భగవంతుని ఒక్క అభేద స్వరూపాలో, ఈ దివ్య శక్తి స్వరూపాలు కూడా భగవంతుని దైవీ శక్తి యొక్క నిజరూపాలే, మరియు ఒకదాని నుండి ఒకటి అభేదములే.

బ్రహ్మ వైవర్తక పురాణం ఇలా పేర్కొంటున్నది:

యథా త్వం రాధికా దేవీ గోలోకే గోకులే తథా
వైకుంఠే చ మహాలక్ష్మీ భవతి చ సరస్వతీ

కపిలస్య ప్రియా కాంతా భారతే భారతీ సతీ
ద్వారవత్యాం మహాలక్ష్మీ భవతీ రుక్మిణీ సతీ

త్వం సీతా మిథిలాయాం చ త్వచ్ఛాయా ద్రౌపదీ సతీ
రావణేన హృతా త్వం చ త్వం చ రామస్య కామినీ

‘ఓ రాధా, నీవే గోలోక (శ్రీ కృష్ణుడి దివ్య ధామము) మరియు గోకుల (ఐదువేల సంవత్సరాల క్రితం ఆయన అవతరించినప్పుడు భౌతిక జగత్తులో శ్రీ కృష్ణుడి ధామము) దివ్య దేవతవు. నీవే వైకుంఠములో (విష్ణు మూర్తి ధామము) మహాలక్ష్మిగా ఉన్నావు. నీవే కపిల దేవుని (భగవంతుని అవతారాల్లో ఒకటి) సహచారిణివి. నీవే ద్వారకలో రుక్మిణీదేవిగా ఉన్నావు (శ్రీ కృష్ణుని భార్య). నీవు మిథిలా నగరంలో సీతగా అవతరించావు. పాండవుల సతి ద్రౌపది, నీ నీడ యొక్క స్వరూపము వంటిది. నీవే రావణాసురిడిచే సీతాదేవిగా అపహరింపబడ్డావు, నీవే శ్రీ రామచంద్ర ప్రభువు సతీమణివి"

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు, అని అంటున్నాడు. దీనికి కారణమేమంటే, భగవత్ కృప, జ్ఞానము, ప్రేమ, మొదలైనవన్నీ భగవంతుని దివ్య శక్తులే, మరియు అన్నీ కూడా భగవంతుని యోగమాయా శక్తి అయిన రాధాదేవి యొక్క దాసీలే. కాబట్టి, యోగమాయ కృపవలన, మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమ, జ్ఞానము మరియు కృప లభిస్తుంది. భగవత్ కృప లభించిన మహాత్ములు, దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు, మరియు అవిచ్చిన్నంగా నిరంతరం భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉంటారు.