Bhagavad Gita: Chapter 11, Verse 34

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ।। 34 ।।

ద్రోణం — ద్రోణాచార్యుడు; చ — మరియు; భీష్మం — భీష్ముడు; చ — మరియు; జయద్రథం — జయద్రథుడు; చ — మరియు; కర్ణం — కర్ణుడు; తథా — మరియు; అన్యాన్ — ఇతరులు; అపి — కూడా; యోధ-వీరాన్ — వీర యోధులు; మయా — నా చేత; హతాన్ — ఇప్పటికే చంపబడ్డారు; త్వం — నీవు; జహి — సంహరింపుము; మా వ్యథిష్ఠా — వ్యాకులపడకుము; యుధ్యస్వ — పోరాడుము; జేతా అసి — నీవు విజయుడవు అవుతావు; రణే — యుద్ధములో; సపత్నాన్ — శత్రువులపై.

Translation

BG 11.34: ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇంతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము, నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.

Commentary

కౌరవుల పక్షమున ఉన్న చాలా మంది యోధులు ఇప్పటివరకూ యుద్ధములో అజేయులే. జయద్రథుడికి ఒక వరము ఉంది; ఎవరైనా ఆయన తల భూమిపై పడేటట్టు చేస్తే, తక్షణం అలా చేసిన వారి తలే ముక్కచెక్కలై పోతుంది అని. కర్ణుడికి ఇంద్రునిచే ఇవ్వబడిన ‘శక్తి’ అనే అస్త్రము ఉంది; అది ఎటువంటి వారిపై ఉపయోగించినా అది వారిని సంహరిస్తుంది. కానీ, ఒక్కసారి మాత్రమే దానిని ఉపయోగించాలి, కాబట్టి కర్ణుడు దానిని అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి దాచుకున్నాడు. ద్రోణాచార్యుడు సమస్త అస్త్ర-శస్త్రముల జ్ఞానాన్ని మరియు వాటిని నిర్వీర్యం చేసే ఉపాయాలని, భగవత్ అవతారమైన పరుశారాముని నుండి నేర్చుకున్నాడు. భీష్ముడికి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేటట్టు ఒక వరం ఉంది. అయినాసరే, భగవంతుడు వారందరూ చనిపోవాలి అని సంకల్పిస్తే, వారిని మరేదీ కాపాడలేదు. ఒక నానుడి ఉంది:

వింధ్య న ఈంధన పాఇయే, సాగర జుడయి న నీర

పరయి ఉపాస కుబేర్ ఘర, జ్యోఁ విపక్ష రఘుబీర

‘శ్రీ రామచంద్ర ప్రభువే నీకు వ్యతిరేకంగా ఉంటే, నీవు వింధ్యాచల అడవులలో ఉన్నా, నీకు అగ్ని రాజుకోవటానికి కలప కూడా దొరకదు. సముద్రము నీ పక్కనే ఉన్నా, వాడుకోవటానికి నీళ్ళు దొరకవు; మరియు సర్వసంపదల ప్రభువు కుబేరుని ఇంట్లోనే నివసిస్తున్నా, నీ భోజనానికి తగినంత దొరకదు.’ అందుకే, భగవంతుడు సంకల్పిస్తే, రక్షణ కోసం ఎంత పెద్ద ఏర్పాట్లు చేసినా అవి ఒక వ్యక్తి యొక్క మృత్యువును తప్పించలేవు. అదే విధంగా, తను ఇంతకు క్రితమే యుద్ధం యొక్క ఫలితాన్ని నిర్ణయించేసాను, కానీ అది సాధించటానికి అర్జునుడిని ఒక పనిముట్టులా ఉండి, తద్వారా వచ్చే కీర్తి ప్రతిష్ఠలను ఫలముగా పొందాలి, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భక్తులు ఎలాగైతే భగవంతుడిని కీర్తించాలని కోరుకుంటారో, అలాగే భగవంతుని స్వభావము కూడా తన భక్తులకు కీర్తిని ఆపాదించాలి అని అనుకుంటాడు. కాబట్టి, ఆ గొప్పతనం తనకు రావాలని కోరుకోడు శ్రీకృష్ణుడు; యుద్ధం తరువాత జనులు అందరూ, ‘అబ్బో అర్జునుడు ఎంత గొప్పగా యుద్ధం చేసాడో చూసారా, ఆయనే పాండవులకు విజయం సాధించి పెట్టాడు.’ అని అనుకోవాలి, అని కోరుకున్నాడు.

ఆధ్యాత్మిక జీవితంలో కూడా సాధకులు తరచుగా, వారి యొక్క క్రోధము, లోభము, ఈర్ష్య, కామము, గర్వము వంటి వాటిని నిర్మూలించ లేకున్నప్పుడు వారి గురువుగారు ఈ విధంగా ఉత్సాహపరుస్తాడు. ‘నిరాశ పడకు, నీ మనస్సులో ఉన్న శత్రువులపై పోరాడుతూనే ఉండుము, ఎందుకంటే, భగవంతుడు నీవు విజయం సాధించాలని కాంక్షిస్తున్నాడు. నీ పరిశ్రమ చాలా ప్రధానం, అదే సమయంలో భగవంతుడు కూడా తన కృపచే నీ విజయాన్ని సఫలం చేస్తాడు.’ అని.

కార్యోన్ముఖుడివి కమ్మని చెప్పిన భగవంతుని పిలుపుకి ఇక అర్జునుడి ప్రతిస్పందన ఎలా ఉంది? తదుపరి శ్లోకంలో ఇది పేర్కొనబడినది.