Bhagavad Gita: Chapter 11, Verse 15

అర్జున ఉవాచ ।
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ।। 15 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; పశ్యామి — దర్శించితిని; దేవాన్ — సర్వ దేవతలను; తవ — నీ; దేవ — భగవంతుడు; దేహే — శరీరము యందే; సర్వాన్ — సర్వమూ; తథా — మరియు; భూత విశేష-సంఘాన్ — విశేషమైన ప్రాణిసమూహమును; బ్రహ్మాణo — బ్రహ్మ దేవుడు; ఈశం — శివుడు; కమల-ఆసన-స్థం — తామర పూవు యందు కూర్చుని ఉన్న; ఋషీం — ఋషులు; చ — మరియు; సర్వాన్ — సర్వ; ఉరగాన్ — సర్పములు; చ — మరియు; దివ్యాన్ — దివ్యమైన.

Translation

BG 11.15: అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీ కృష్ణా, నీ దేహము యందు నేను - సకల దేవతలనూ, ఎన్నెనో ప్రాణికోటి సమూహములను, కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, శివుడిని, అందరు ఋషులను, మరియు దివ్య సర్పములను - చూచుచున్నాను.

Commentary

స్వర్గాది లోకములలో ఉండే దేవతలతో సహా, ముల్లోకముల యొక్క సమస్త ప్రాణులను, తాను చూడగలుగుతున్నానని అర్జునుడు ప్రకటిస్తున్నాడు. కమలాసనస్థమ్ అన్న పదం బ్రహ్మ దేవుడికి వర్తిస్తుంది; ఆయన బ్రహ్మాండము యొక్క కమలము మధ్యలో కూర్చుని ఉంటాడు. శంకర భగవానుడు, విశ్వామిత్రుడు మొదలగు ఋషులు, వాసుకి వంటి సర్పములు అన్నీ కూడా ఆ యొక్క విశ్వ రూపంలో కనిపించాయి.