Bhagavad Gita: Chapter 11, Verse 55

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః ।
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ ।। 55 ।।

మత్-కర్మ-కృత్ — నా కోసమే విధులను నిర్వర్తిస్తూ; మత్-పరమః — నన్నే సర్వోన్నతముగా పరిగణిస్తూ; మత్-భక్తః — నా భక్తుడుగా ఉంటూ; సంగ వర్జితః — మమకారాసక్తులు వదిలి; నిర్వైరః — వైరభావము లేకుండా; సర్వ-భూతేషు — సర్వ భూతముల పట్ల; యః — ఎవరైతే; సః — అతడు; మాం — నన్ను; ఏతి — పొందును; పాండవ — ఓ అర్జునా, పాండు రాజు తనయుడా.

Translation

BG 11.55: ఎవరైతే అన్ని కర్మలనూ నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వ భూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు.

Commentary

తొమ్మిదవ అధ్యాయం చివరన, శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సు తనయందే లగ్నం చేసి, తన పట్ల భక్తితో ఉండమని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క భక్తిని ఇనుమడింపచేయటానికి, తన గురించి ఇంకా కొన్ని రహస్యాలను పది, పదకొండు అధ్యాయాలలో తెలియచేసాడు. ఇంతకు క్రితం శ్లోకంలో, కృష్ణుడు, భక్తి మార్గము యొక్క ఔన్నత్యాన్ని మరల తెలియచేసాడు. ఇక ఇప్పుడు ఈ అధ్యాయాన్ని, తన పట్ల అనన్య భక్తితో ఉండేవారి ఐదు లక్షణములను తెలియచేస్తూ ముగిస్తున్నాడు:

వారు తమ యొక్క అన్ని పనులను నా కోసమే చేస్తారు: కృతార్థులైన భక్తులు తమ పనులను ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక (material and spiritual) అనే రకాలుగా విభజించరు. ప్రతి పనినీ భగవంతుని ప్రీతి కోసమే చేస్తారు. తమ ప్రతి ఒక్క పనిని ఆయనకే సమర్పిస్తారు. సంత్ కబీర్ ఇలా పేర్కొంటున్నాడు:

జహాఁ జహాఁ చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ దండవత్ , జానూ దేవ న దూజా

‘నేను నడుస్తున్నప్పుడు ఆ భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్నానని భావిస్తాను; నేను పని చేస్తున్నప్పుడు, ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావిస్తాను; మరియు నేను పడుకున్నప్పుడు, ఆ భగవంతునికి ప్రణామం అర్పిస్తున్నానని భావిస్తాను. ఈ విధంగా, ఆయనకు నివేదించని ఏ పనిని కూడా నేను చేయను.’

వారు నా మీదే ఆధారపడుతారు: ఎవరైతే భగవంతుడిని చేరటానికి తమ ఆధ్యాత్మిక సాధనపై ఆధార పడుతారో వారు ఆయన మీద అనన్యముగా ఆధార పడినట్టు కాదు. అది ఎందుకంటే, ఆయన తన కృప వలననే పొందబడుతాడు, ఆధ్యాత్మిక సాధనలచే కాదు. ఆయన యొక్క అనన్య భక్తులు, ఆయనను పొందటానికి వారి యొక్క భక్తి మీద కూడా ఆధారపడరు. సరికదా, వారి భక్తిని ఆయన కృపను ఆకర్షించే ఉపాయముగా మాత్రమే చూస్తూ, వారి యొక్క సంపూర్ణ విశ్వాసం ఆయన కృప మీదనే ఉంచుతారు.

వారు నా పట్ల భక్తివిశ్వాసాలతో ఉంటారు: భక్తులకు ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనలను కూడా చేయాలనే అవసరం అనిపించదు; ఉదాహరణకు, సాంఖ్య శాస్త్ర జ్ఞానము పెంపొందించుకోవడం, అష్టాంగ యోగ అభ్యాసము, యజ్ఞయాగాదులు చేయటం, మొదలైనవి. ఈ విధంగా, వారు తమ సంబంధమంతా భగవంతునితో మాత్రమే ఉందని కోరుకుంటారు. సమస్త వస్తువులలో మరియు వ్యక్తులలో/ప్రాణులలో తమ ప్రియతమ భగవంతుడినే దర్శిస్తారు.

వారు మమకారాసక్తి రహితముగా ఉంటారు: భక్తికి మనస్సు నిమగ్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రాపంచికత్వం నుండి మనస్సుని తీసివేస్తే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి అనన్య భక్తులు అన్ని ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా ఉంటారు మరియు తమ మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు.

వారు సర్వ ప్రాణుల యందు దుర్భావన లేకుండా ఉంటారు: ఒకవేళ మనసులో దుర్భావన నిండి ఉంటే అది మరల భగవంతుని పట్ల అనన్య ఏకాగ్రతతో ఉండదు. అందుకే అనన్య భక్తులు ఎవ్వరి మీద కూడా దుర్భావనతో ఉండరు, తమకు హాని చేసిన వారిపట్ల కూడా అలా ఉండరు. అంతేకాక, భగవంతుడు సర్వ భూతముల హృదయ స్థానములో ఉన్నాడని విశ్వసిస్తూ, అన్ని వ్యవహారాలు కూడా ఆయన నుండే జనిస్తున్నాయి భావిస్తూ వారు తమకు అపకారం చేసిన వారిని కూడా క్షమిస్తారు.