సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి ।
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ।। 41 ।।
యచ్చావహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు ।
ఏకోఽథ వాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ।। 42 ।।
సఖా — మిత్రుడు (సఖుడు); ఇతి — అలా; మత్వా — అనుకుంటూ; ప్రసభం — మూర్ఖముగా; యత్ — ఏదేని; ఉక్తం — సంభోదించి; హే కృష్ణ — ఓ శ్రీ కృష్ణా; హే యాదవ — ఓ శ్రీ కృష్ణ, యదు వంశములో జన్మించిన వాడా; హే సఖే — ఓ ప్రియ మిత్రమా; ఇతి — ఈ విధముగా; అజానతా — అజ్ఞానములో; మహిమానం — మహిమను; తవ — నీ యొక్క; ఇదం — ఇది; మయా — నా చేత; ప్రమాదాత్ — నిర్లక్ష్యముతో; ప్రణయేన — ప్రేమతో; వా అపి — లేదా; యత్ — ఏదయినా; చ — మరియు; అవహాస-అర్థం — పరిహాసము కొరకై; అసత్-కృతా — అమర్యాదతో; అసి — నీవు ఉన్న; విహారా — ఆడుతున్నప్పుడు; శయ్యా — శయనించి ఉన్నప్పుడు; ఆసనా — కూర్చున్నప్పుడు; భోజనేషు — భోజనం చేస్తున్నప్పుడు; ఏకః — ఒక్కడివే ఉన్నప్పుడు; అథవా — లేదా; అపి — కూడా; అచ్యుతా — కృష్ణా, దోషములు లేనివాడా; తత్-సమక్షం — ఇతరుల ముందు; తత్ — అవన్నీటిని; క్షామయే — క్షమించమని ప్రార్ధిస్తున్నాను; త్వాం — నీ నుండి; అహం — నేను; అప్రమేయం — అపరిమితమైన.
Translation
BG 11.41-42: నీవు నా సఖుడవు (మిత్రుడవు) అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, "ఓ కృష్ణా", "ఓ యాదవా", "ఓ నా ప్రియ మిత్రమా" అని పిలిచాను. నీ మహిమ తెలియక, నిర్లక్షముగా, అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుతున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే, దానికి నేను క్షమాపణలను వేడుకుంటున్నాను.
Commentary
భగవంతుని యొక్క సాటిలేని సర్వోన్నత స్థాయిని ప్రకటిస్తూ, అన్ని వేద శాస్త్రాలు కూడా ఇలా పేర్కొంటున్నాయి:
అహం ఏవాసం ఏవాగ్రే నాన్యత్ కించాంతరం బహిః (భాగవతం 6.4.47)
"నేను, సర్వేశ్వరుడైన భగవంతుడను, జగత్తులో ఉన్నదంతా నేనే. నాకన్నా అతీతమైనది ఏదీ లేదు మరియు నాకన్నా ఉన్నతమైనదీ ఏది లేదు." (భాగవతం 6.4.47)
త్వం ఓంకారః పరాత్పరః (వాల్మీకి రామాయణం)
"సనాతనమైన ప్రణవ నాదము “ఓం” కారము నీ యొక్క స్వరూపమే. నీవు అత్యున్నతమైన వాటికంటే కూడా ఉన్నతుడవు."
వాసుదేవః ప్రః ప్రభుః (నారద పంచరాత్ర)
“శ్రీ కృష్ణుడే సర్వోన్నత సర్వోత్క్రుష్ట భగవానుడు”
న దేవః కేశవాత్ పరః (నారద పురాణం)
"శ్రీ కృష్ణ పరమాత్మను మించిన దేవుడు ఎవరూ లేరు."
విద్యాత్ తం పురుషం పరం (మను స్మృతి 12.122)
"భగవంతుడే అత్యున్నత, సర్వోన్నత పరమపురుషుడు" కానీ, ఇంతకు క్రితం 11.24వ శ్లోక వ్యాఖ్యానంలో చెప్పినట్టుగా, ప్రేమ ఉప్పొంగిపోయినప్పుడు, అది ప్రేమించేవాడిలో, ప్రేమించబడే వాని యొక్క అధికార స్థాయిని మర్చిపోయేటట్లు చేస్తుంది. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి పట్ల తన యొక్క గాఢమైన ప్రేమలో, ఆయన యొక్క పరతత్వాన్ని మర్చిపోయి, అర్జునుడు ఆయనతో ఎంతో మధురమైన సన్నిహితమైన సమయాన్ని గడిపాడు.
భగవంతుని యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, అర్జునుడికి ఇప్పుడు ఒకలా ఇబ్బందికరంగా, శ్రీ కృష్ణుడు కేవలం తన సఖుడు, మిత్రుడుయే కాక – ఆయన, దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆరాధించే సర్వోన్నత దివ్య పురుషుడు అని తెలిసింది. అందుకే, తెలియనితనంలో, కేవలం మిత్రుడే కదా అనే ధైర్యంతో, తానేమైనా కృష్ణుడి పట్ల అమర్యాద తో ప్రవర్తించి ఉంటే దానికి పశ్చాత్తాప పడుతున్నాడు. గౌరవింపబడేవారు, మర్యాద పూర్వకంగా, కేవలం వాడుక నామ పేరుతో పిలవబడరు. తనకున్న దగ్గరి సాన్నిహిత్యం వలన, తనను భగవంతునితో సమానంగా ఊహించుకుని, అతిచనువుగా, "మిత్రమా, ప్రియ సఖా, ఓ కృష్ణ " అన్న పిలుపులతో కృష్ణుడిని సంభోదించాడని కలవర పడుతున్నాడు అర్జునుడు. అందుకే శ్రీ కృష్ణుడి దివ్య పరతత్వ వ్యక్తిత్వాన్ని మర్చిపోయిన స్థితిలో తనవలన ఏమైనా తప్పు జరిగిఉంటే దానికి క్షమాభిక్షను అర్ధిస్తున్నాడు.