Bhagavad Gita: Chapter 8, Verse 16

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున ।
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ।। 16 ।।

ఆ-బ్రహ్మ-భువనాత్ — బ్రహ్మలోక పర్యంతమూ; లోకాః — లోకములు; పునః-ఆవర్తినః — పునర్జన్మకు లోబడి; అర్జున — అర్జునా; మామ్ — నన్ను; ఉపేత్య — పొందిన పిదప; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి పుత్రుడా; పునః-జన్మ — మళ్లీ పుట్టుట; న విద్యతే — ఉండదు.

Translation

BG 8.16: బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కానీ నా ధామమునకు చేరిన పిదప, ఓ కుంతీ పుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు.

Commentary

వేద శాస్త్రములు, భూలోకం కన్నా నిమ్న స్థాయిలో ఏడు లోకాలున్నాయని వివరించాయి - అవి - తళ, అతళ, వితళ, సుతళ, తలాతళ, రసాతళ, పాతాళ లోకాలు. వీటినే నరకములు అంటారు. భూలోకంలో మొదలిడి ఇంకా పైన కూడా మొత్తం ఏడు లోకాలు ఉన్నాయి - భూః , భువః , స్వః , మహః , జనః , తపః , సత్యః అనేవి ఇవి. ఈ పై వాటిని స్వర్గము లేదా దేవ లోకాలు అంటారు. వేరే మత సాంప్రదాయాల్లో కూడా ఏడు స్వర్గాలు ఉన్నట్లుగా సూచించబడినది. జుడాఇసం లో ఏడు స్వర్గాల పేర్లు, తాల్మడ్ (Talmud) లో చెప్పబడ్డాయి; దీనిలో అరబోత్ (Araboth) అనేది అన్నిటికన్నా ఉన్నతమైనదిగా చెప్పబడింది (Psalm 68.4 కూడా చూడండి). ఇస్లాం ధర్మంలో కూడా ఏడు స్వర్గాలు చెప్పబడ్డాయి – దీనిలో ‘సాత్ వాఁ ఆస్మాన్’ sātvāñ āsmān (ఏడవ ఆకాశం) అత్యున్నత మైనదిగా ఎంచబడింది.

ఈ వివిధ రకాల అస్తిత్వ స్థాయిలనే వేర్వేరు లోకాలు అంటాము. మన విశ్వంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కెల్లా ఉన్నతమైనది బ్రహ్మ దేవుని ధామము, బ్రహ్మ-లోకం, అంటారు. ఈ లోకాలన్నీ మాయ యొక్క పరిధిలోనే ఉన్నాయి మరియు ఈ లోకాల్లో నివాసము ఉంటున్నవారు జన్మ మరణ చక్రం లోనికి గురౌతూనే ఉంటారు. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం శ్లోకంలో వీటిని దుఃఖాలయం మరియు అశాశ్వతం అని చెప్పి ఉన్నాడు.

దేవతల అధిపతి అయిన ఇంద్రుడు కూడా, ఒకానొక రోజు మరణించాల్సిందే. మన పురాణాల కథనం ప్రకారం: ఒకసారి ఇంద్రుడు, దేవశిల్పి విశ్వకర్మ - ను ఒక అతి పెద్ద రాజభవనం నిర్మించమని పురమాయించాడు. ఎన్నటికీ పూర్తికాని ఆ నిర్మాణ పనికి అలసిపోయిన విశ్వకర్మ భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుడు అక్కడికి వచ్చి ఇంద్రుడిని ‘ఎంత పెద్ద భవనమో! ఎంత మంది విశ్వకర్మ దీనిలో నిమగ్నమైనారు?’ అని అడిగాడు.

ఈ ప్రశ్నతో ఇంద్రుడు ఆశ్చర్య పడి, ఇలా బదులిచ్చాడు, "ఒక్కడే విశ్వకర్మ ఉన్నాడు అనుకున్నాను కదా."

భగవంతుడు నవ్వి ఇలా అన్నాడు, ‘ఈ పద్నాలుగు లోకాలతో ఉన్న బ్రహ్మాండం లాగానే, అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి దానిలో ఒక ఇంద్రుడు, ఒక విశ్వకర్మ ఉన్నాడు.’

ఆ తర్వాత ఇంద్రుడు చీమల లైన్లు తన వైపు నడుస్తూ రావటం గమనించాడు. ఇంద్రుడు ఆశ్చర్యంతో ఇన్ని చీమలు ఎక్కడ నుండి వచ్చాయో అని అడిగాడు. భగవంతుడు ఇలా అన్నాడు, ‘ఒకప్పుడు పూర్వ జన్మలలో ఇంద్రుడిగా ఉండి, ఇప్పుడు చీమ శరీరంలో ఉన్న అన్ని జీవాత్మలను ఒకసారి పిలిచాను’ అని. ఇంద్రుడు వాటి అపారమైన సంఖ్య చూసి ఆశ్చర్యచకితుడైనాడు.

కొద్దిసేపు తరువాత, లోమేశ ఋషి అక్కడకు వచ్చాడు. ఆయన తలపై ఒక గడ్డి చాప పెట్టుకుని ఉన్నాడు; ఆయన ఛాతీపై ఒక వెంట్రుకల వలయం ఉంది. ఆ వృత్తం నుండి కొన్ని వెంట్రుకలు ఊడిపోయి ఉండి అక్కడక్కడా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంద్రుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి, మర్యాదగా ఇలా అడిగాడు, ‘అయ్యా, మీరు ఎందుకు ఇలా గడ్డి చాపను నెత్తి మీద మోస్తున్నారు? ఇంకా, మీ ఛాతీ మీద వెంట్రుకల వలయం యొక్క అర్థం ఏమిటి?’ అని’.

లోమేశ ఋషి ఇలా బదులిచ్చాడు, ‘నాకు చిరాయువుగా ఉండే వరం ఉంది. ఈ బ్రహ్మాండంలో ఒక ఇంద్రుడి పదవీకాలం అయిపోగానే, ఒక వెంట్రుక ఊడిపోతుంది. అందుకే వృత్తంలో ఖాళీలు ఉన్నాయి. నా శిష్యులు నేను ఉండటానికి ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు, కానీ జీవితం తాత్కాలికమైనది అనుకుంటున్నాను, కాబట్టి ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం? నేను ఈ గడ్డి చాపను పెట్టుకుంటాను, ఇదే నన్ను ఎండ, వాన నుండి రక్షిస్తుంది. రాత్రి పూట దీనిని నేలపై పరుచుకుని పడుకుంటాను.’

ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై , ‘ఈ ఋషికి ఎంతో మంది ఇంద్రుల మేర జీవితకాలం ఉంది, అయినా ఈయన జీవితం తాత్కాలిక మైనదే అనుకుంటున్నాడు. ఇక నేను మాత్రం ఎందుకు ఇంత పెద్ద రాజభవనం నిర్మిస్తున్నాను? అని అనుకున్నాడు.’ అతని అహంకారం నశించిపోయింది మరియు విశ్వకర్మను పంపించివేసాడు.

ఈ కథలు చదువుతున్నప్పుడు, విశ్వనిర్మాణశాస్త్రం గురించి భగవద్గీత చెప్పిన అద్భుతమైన లోతైన విషయాల పట్ల విస్మయం చెందకుండా ఉండలేము. 16వ శతాబ్దం వరకు కూడా, నికోలాస్ కోపర్నికస్ అనే ఆయనే, మొదటి పాశ్చాత్య శాస్త్రవేత్త సరియైన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని (heliocentric theory) ప్రతిపాదించి, సూర్యుడే నిజానికి విశ్వానికి కేంద్రము అని చెప్పాడు. అప్పటివరకు, మొత్తం పాశ్చాత్య ప్రపంచం, భూగ్రహమే విశ్వానికి కేంద్రము అనే నమ్మికతో ఉండేది. ఖగోళ శాస్త్రంలో, తరువాత వచ్చిన పురోగతి, సూర్యుడు కూడా విశ్వానికి కేంద్రము కాదు అని తెలియ చెప్పింది; సూర్యుడు కూడా మిల్కీ వే అనబడే పాలపుంత (galaxy) యొక్క కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు అని చెప్పింది. మరింత పురోగతి జరిగిన పిదప, శాస్త్రవేత్తలు, ఇలాంటి మిల్కీ-వే లాంటి పాలపుంతలు (galaxies) మరెన్నో ఉన్నట్టు, ప్రతిదానిలో మన సూర్యుడు వంటి ఎన్నెన్నో నక్షత్రాలు ఉన్నట్టు తెలుసుకున్నారు.

దీనితో పోలిస్తే, వైదిక వాఙ్మయంలో, ఐదువేల సంవత్సరాల క్రితమే, ఈ భూమి, భూః లోకమని, ఇది స్వర లోకం చుట్టూ పరిభ్రమిస్తున్నదనీ, మరియు ఈ రెండింటి మధ్య భువర్లోకం ఉందని చెప్పింది. కానీ, స్వర లోకం కూడా నిలకడగా లేదు, అది జనలోకం యొక్క గురుత్వాకర్షణలో స్థితమై ఉంది, ఈ రెంటి మధ్య ఆకాశంలో మహర్లోకం ఉంది. కానీ, జనలోకం కూడా స్థిరంగా లేదు; అది బ్రహ్మలోకం (సత్య లోకం) చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఈ రెంటి మధ్యలో తపోలోకం ఉన్నది.; అని పేర్కొన్నది. ఇది పైనున్న ఏడు లోకాలను వివరిస్తున్నది; ఇదే ప్రకారంగా ఏడు క్రింది లోకాలు ఉన్నాయి. ఇప్పుడు గమనిస్తే, ఐదు వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ఈ లోతైన అవగాహన అత్యద్భుతం అనిపిస్తుంది.

ఈ అన్ని పద్నాలుగు లోకాలు కూడా మాయ ఆధీనంలోనే ఉన్నట్టు ఈ శ్లోకం శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు, కాబట్టి వాటిలో నివాసం ఉండేవారు జనన-మరణ చక్రానికి గురిఅవుతుంటారు. కానీ, భగవత్ ప్రాప్తి పొందినవారు, ఈ మాయ యొక్క బంధము నుండి విడుదల చేయబడుతారు. మృత్యు సమయంలో, ఈ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు. అక్కడ వారు దివ్య శరీరాలు పొందుతారు, సదా (శాశ్వతముగా) భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. ఈ విధంగా వారు ఈ భౌతిక ప్రపంచంలో మరల జన్మించవలసిన అవసరం లేదు. కొంత మంది మహాత్ములు మాయా నివృత్తి పొందిన తరువాత కూడా తిరిగి వస్తారు, కానీ, వారు ఇతరులను కూడా మాయా బంధముల నుండి విముక్తి చేయటానికే వస్తారు. మానవ జాతి యొక్క కళ్యాణం కోసం, అవతరించిన మహాత్ములు మరియు ప్రవక్త (గురువు) లు ఈ కోవకు చెందినవారే.