Bhagavad Gita: Chapter 8, Verse 7

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 7 ।।

తస్మాత్ — కాబట్టి; సర్వేషు — అన్నీ; కాలేషు — సమయాల్లో; మామ్ — నన్ను; అనుస్మర — స్మరించుము; యుధ్య — యుద్ధము చేయుము; చ — మరియు; మయి — నాకు; అర్పిత — శరణాగతి చేసి అర్పించి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; మామ్ — నన్ను; ఏవ — ఖచ్చితంగా; ఏష్యసి — నీవు పొందుతావు; అసంశయః — సందేహము లేకుండా.

Translation

BG 8.7: కాబట్టి, సర్వ కాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు; ఈ విషయంలో సందేహం లేదు.

Commentary

ఈ శ్లోకం యొక్క మొదటి పాదం, భగవద్గీత యొక్క ఉపదేశ సారాంశము. దీనికి మన జీవితాన్ని దివ్య మైనదిగా చేసే శక్తి ఉంది. కర్మ యోగ యొక్క నిర్వచనం కూడా ఇందులోనే పొందుపరచబడి ఉంది. శ్రీ కృష్ణుడు అంటున్నాడు – ‘నీ మనస్సుని నా యందే లగ్నం చేయుము, మరియు శరీరంతో నీ ప్రాపంచిక కర్తవ్యాన్ని చేయుము.’ ఈ సూత్రం అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది - డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, గృహిణులు, విద్యార్థులు, మరియు మిగతా అందరికీ కూడా. అర్జునుడికి సంబంధించినంత వరకు, అతను ఒక క్షత్రియుడు, మరియు ఆయన ధర్మం యుద్ధం చేయటమే. కాబట్టి, అతను, మనస్సుని కృష్ణుని యందు ఉంచి తన కర్తవ్యాన్ని చేయాలని ఉపదేశించబడుతున్నాడు. కొంతమంది తాము ఆధ్యాత్మిక జీవితం అవలంబిస్తున్నాము అన్న మిషతో తమ ప్రాపంచిక విధులని ఆలక్ష్యం చేస్తారు. మరికొంత మంది ప్రాపంచిక పనుల నెపంతో ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యం చేస్తారు. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక వ్యవహారములకు సమన్వయం కుదరదు అని జనులు అనుకుంటారు. కానీ, భగవంతుని సందేశం మన సంపూర్ణ జీవితాన్ని పవిత్రముగావించటమే.

ఈ విధమైన కర్మ యోగము అభ్యాసము చేసినప్పుడు, ప్రాపంచిక పనులు ఏవీ నిర్లక్ష్యం చేయబడవు ఎందుకంటే శరీరము వాటిలోనే నిమగ్నమై ఉంటుంది. కానీ, మనస్సు భగవంతుని యందే నిమగ్నమవటం వలన ఈ పనులు వ్యక్తిని కర్మ బంధాలలో పెనవేయవు. ఏవైతే పనులను వాటిపై మమకారాసక్తితో చేస్తామో, అవే మనలను కర్మ బంధాలలో పెనవేస్తాయి. ఎప్పుడైతే పని అనురాగ/ఆసక్తి రహితంగా ఉంటుందో, ప్రాపంచిక న్యాయము కూడా మనలను ఆ పనులకు అపరాధిగా పరిగణించదు. ఉదాహరణకి, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే అతన్ని కోర్టులో హాజరుపరిచారనుకోండి.

న్యాయమూర్తి అడుగుతాడు, ‘నీవు ఆ మనిషిని చంపావా?’

అతను ఇలా సమాధానమిస్తాడు, ‘అవునండి, వేరే సాక్ష్యం ఏమీ అవసరం లేదు, నేనే చంపానని ఒప్పుకుంటున్నాను.’

‘మరి అప్పుడైతే నీకు శిక్ష పడాలి!’

‘లేదు, యువర్ ఆనర్, మీరు నన్ను శిక్షించలేరు.’

‘ఏం ఎందుకు?’

‘నాకు అతనిని చంపాలని ఏమీ ఉద్దేశ్యం లేదు. నేను వాహనాన్ని రోడ్డుపై సరియైన దిశలోనే నడుపుతున్నాను, వేగ పరిమితికి లోపలే ఉన్నాను, నా దృష్టి ముందుకే కేంద్రీకరించి ఉంది. నా బ్రేకులు, స్టీరింగ్, అన్నీ సరిగ్గాన్నే ఉన్నాయి. ఆ మనిషి ఒక్కసారిగా నా వాహనం ముందుకు ఉరికి వచ్చాడు. నేనేమి చేసేది?’

ఆయన తరఫు న్యాయవాది అతనిలో చంపాలనే ఉద్దేశ్యం ఏమీ లేదు అని నిరూపించినప్పుడు, న్యాయమూర్తి అతనిని ఎటువంటి శిక్ష లేకుండానే విడిచి పెడతాడు.

బాహ్య ప్రపంచంలో కూడా మనం ఆసక్తి/మమకారం లేకుండా చేసే పనులకి మనలను దోషులుగా పరిగణించరు అని ఈ పై ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తోంది. ఇదే సూత్రం కర్మ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుంది. అందుకే, మహా భారత యుద్దంలో, శ్రీ కృష్ణుడి ఉపదేశాన్ని పాటిస్తూ, అర్జునుడు యుద్ధ రంగంలో తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం ముగిసేటప్పటికి, అర్జునుడు ఎలాంటి పాపమును చేయనట్టే, అని శ్రీ కృష్ణుడు పరిగణించాడు. ప్రాపంచిక లాభం కోసం లేదా కీర్తి కోసం గనక మమకార/ఆసక్తితో అర్జునుడు ఆ యుద్ధం చేసి ఉంటే అతను కర్మ బంధాలలో చిక్కుకుని ఉండేవాడు. కానీ, అతని మనస్సు శ్రీ కృష్ణుడితో అనుసంధానమై ఉన్నది, స్వార్థ పూరిత ఆసక్తి లేకుండా ఈ లోకంలో తన ధర్మ/విధులు నిర్వర్తిస్తూ ఉండటంచే ఆయన చేసేది సున్నాతో గుణించబడుతున్నది. ఒక లక్ష సంఖ్య నైనా సున్నాతో గుణిస్తే వచ్చేది సున్నానే.

కర్మ యోగానికి సంబంధించిన షరతు ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. మనస్సుని నిరంతరం భగవంతుడిని స్మరించటంలో నిమగ్నమై ఉంచాలి. మనస్సు ఒక్కక్షణమైనా భగవంతుడిని మర్చిపోతే, మరుక్షణం అది మాయ యొక్క సైన్యం లోని యోధుల దాడికి గురౌతుంది – కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, ద్వేషము వంటి నకారాత్మక భావోద్వేగాలు. అందుకే, దానిని ఎల్లప్పుడూ భగవంతునితో అనుసంధానం చేసి ఉంచాలి. తరచుగా జనులు తాము కర్మ మరియు యోగ చేస్తున్నాము కాబట్టి తమని తాము కర్మయోగులము అనుకుంటారు. రోజులో చాలా భాగము వారు కర్మ చేస్తారు, మరియు కొద్ది నిముషాలు వారు 'యోగం' చేస్తారు (భగవంతునిపై ధ్యానము). కానీ, ఇది కాదు శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగ నిర్వచనము. ఆయన ప్రకారం 1) కర్మలు చేస్తూనే ఉన్నా మనస్సు మాత్రం భగవంతుని స్మరణ యందే నిమగ్నమై ఉండాలి. 2) భగవంతుని స్మరణ అప్పుడప్పుడూ కాకుండా రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి.

సంత్ కబీర్ తన ప్రముఖ కావ్యంలో దీనిని ఇలా వ్యక్తపరిచాడు:

సుమిరన్ కీ సుధి యోఁ కరో, జ్యాఊఁ గాగర్ పనిహార

బోలత్ డోలత్ సురతి మేఁ, కహే కబీర విచార్

‘ఒక గ్రామీణ మహిళ తన నెత్తిపై ఉన్న నీటి కుండని ఎలా గుర్తుంచుకుంటుందో అలాగే భగవంతుడిని గుర్తుంచుకొనుము. ఆమె తోటివారితో మాట్లాడుతూ ఉంటుంది, బాటలో నడుస్తూ ఉంటుంది, కానీ ఆమె మనస్సు ఆ పైనున్న కుండపైనే ఉంటుంది.’

తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు కర్మ యోగ అభ్యాసము యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు.