Bhagavad Gita: Chapter 8, Verse 14

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః ।
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ।। 14 ।।

అనన్య-చేతాః — మనస్సు ఎటూ చలింపక; సతతం — ఎల్లప్పుడూ; యః — ఎవరైతే; మాం — నన్ను; స్మరతి — స్మరించునో; నిత్యశః — నిరంతరమూ; తస్య — అతనికి; అహం — నేను; సులభః — సులభముగానే లభింతును; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; నిత్య — ఎల్లప్పుడూ; యుక్తస్య — నిమగ్నమై; యోగినః — యోగులలో.

Translation

BG 8.14: ఓ పార్థా, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి.

Commentary

భగవద్గీత అంతటా శ్రీ కృష్ణుడు చాలా సార్లు భక్తిని వక్కాణించాడు. ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు నిర్గుణ నిరాకార భగవత్ తత్త్వంపై ధ్యాసను వివరించాడు. అది మాధుర్యరహితమే కాక చాలా క్లిష్టమయినది కూడా. కాబట్టి ఇక్కడ ఒక సులువైన ప్రత్యామ్నాయమును ఇస్తున్నాడు; అదే ఆయన యొక్క సగుణ సాకార రూపము పై ధ్యానము - కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు మొదలగు వాటిపై. ఆయన దివ్య మంగళ స్వరూపము యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము, అన్నీ ఇందులో భాగమే.

భగవద్గీత మొత్తంలో ఇదొక్కటే చోట శ్రీ కృష్ణుడు తాను సులభుడను అని అన్నాడు. కానీ, ఆయన పెట్టిన ఒక షరతు ఏమిటంటే, అనన్య-చేతాః , మనస్సు కేవలం ఆయన యందు మాత్రమే నిమగ్నమై ఉండాలి, వేరే దేని మీద ఉండవలదు. ఇక్కడ, అనన్య అన్న పదం చాలా ముఖ్యమైనది. భాషా పరంగా దీని అర్థం, న-అన్య అంటే 'వేరే ఇతరమైనది ఏదీ కాకుండా'. మనస్సు అనేది భగవంతుని యందు మాత్రమే నిమగ్నమవ్వాలి, వేరే ఏ ఇతర మైన వాటి మీదా కాకూడదు. ఈ 'అనన్య' అనే నియమము భగవద్గీతలో చాలా సార్లు పదేపదే చెప్పబడింది.

అనన్యాశ్ చింతయంతో మాం (9.22)
తం ఏవ శరణం గచ్ఛ (18.62)
మాం ఏకం శరణం వ్రజ (18.66)

అనన్య భక్తి అనే విషయం ఇతర శాస్త్ర/పురాణాల్లో కూడా ఉద్ఘాటించబడినది.

మాం ఏకం ఏవ శరణం ఆత్మానం సర్వ-దేహినామ్

(భాగవతం 11.12.15)

‘సమస్త ప్రాణులకు పరమాత్మ నైన నాకు మాత్రమే శరణాగతి చేయుము.’

ఏక భరోసో ఏక బల ఏక్ ఆస విస్వాస (రామచరితమానస్)

‘నాకు ఉన్నది ఒకేఒక్క ఆధారం, ఒకేఒక్క బలము, ఒకేఒక్క విశ్వాసము, ఒకేఒక్క ఆశ్రయము - అదే శ్రీ రామచంద్రమూర్తి’

అన్యాశ్రయాణామ్ త్యాగో ఽనన్యతా

(నారద భక్తి దర్శన్, 10వ సూత్రము)

‘మిగతా అన్ని ఆశ్రయములను విడిచిపెట్టి కేవలం భగవంతునికే చెందిన వాడివి అవ్వుము.’

అనన్య భక్తి అంటే, వేరే ఏ ఇతరమైనదీ లేకుండా, మనస్సు కేవలం ఆ దివ్య మంగళ స్వరూపము యొక్క - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారము - లలోనే నిమగ్నమై ఉండాలి. దీనిలో ఉన్న తర్కం చాలా సరళమైనది. సాధనా యొక్క లక్ష్యం మనస్సుని పరిశుద్ధి చేయటమే, ఇది కేవలం మనస్సుని అత్యంత పవిత్రమైన భగవంతునికి అనుసంధానం చేయటం ద్వారానే సాధ్యము. కానీ, మనం మనన్సుని భగవత్ ధ్యానం ద్వారా శుద్ది చేసినప్పటికీ, మరల దానిని ప్రాపంచికత్వంలో ముంచి మలిన పరిస్తే, మరిక ఎంత కాలం ప్రయత్నించినా, మనము దాన్ని శుద్ధి చేయలేము.

చాలా మంది చేసే తప్పు సరిగ్గా ఇదే. వారు భగవంతుడిని ప్రేమిస్తారు, కానీ, అదే సమయంలో, ప్రాపంచిక వస్తువులను, మనుషులను కూడా ప్రేమిస్తూ వాటితో అనురాగం పెంచుకుంటారు. దీనితో, సాధన ద్వారా పొందిన లాభమంతా ప్రాపంచిక మమకారాసక్తి వలన నష్టమైపోతుంది. బట్టని శుద్ధి చేయటానికి దానిపై సబ్బు రాస్తూ, అదే సమయంలో దానిపై దుమ్ము వేస్తుంటే, మన శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, కేవలం భక్తి కాదు, ఆయన పట్ల అనన్య భక్తి మాత్రమే మనం ఆయనను సులభంగా పొందేటట్లు చేస్తుంది అని.