Bhagavad Gita: Chapter 4, Verse 1

శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।

శ్రీ భగవానువాచ — పరమేశ్వమైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను; ఇమం — ఈ యొక్క; వివస్వతే — సూర్య భగవానునికి; యోగం — యోగ శాస్త్రము; ప్రోక్తవాన్ — ఉపదేశించాను; అహం — నేను; అవ్యయం — సనాతనమైన; వివస్వాన్ — సూర్య భగవానుడు; మనవే — మనువుకు, మానవ జాతి యొక్క మూల పురుషుడు; ప్రాహ — చెప్పెను; మనుః — మను; ఇక్ష్వాకవే — ఇక్ష్వాకుడుకి, సూర్య వంశపు మొదటి చక్రవర్తి; అబ్రవీత్ — బోధించాడు.

Translation

BG 4.1: శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.

Commentary

అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా కేవలం చెపితే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు దాని విలువని తెలుసుకొని, గౌరవించి, ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే వారు తమ జీవిత నడవడిక లో దానిని ఆచరించటానికి కావలసిన పరిశ్రమ చేస్తారు. అర్జునుడికి తను ఉపదేశించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయత, ప్రాముఖ్యతని ఈ శ్లోకం లో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తను ఉపదేశించే ఈ జ్ఞానం కేవలం ఆర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం ఇప్పటికిప్పుడు పుట్టించింది కాదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదట వివస్వానుడికి (సూర్య భగవానుడు) ఇదే యోగ శాస్తాన్ని బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకి; మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికి బోధించారు. ఇది జ్ఞాన సముపార్జన యొక్క అవరోహణ క్రమం; ఈ పద్దతిలో జ్ఞానంపై సంపూర్ణ ప్రామాణ్యము కలిగిన వారు దానిని తెలుసుకోగోరిన వారికి ఆపాదిస్తారు.

దీనికి భిన్నంగా, ఆరోహణ క్రమ జ్ఞాన సముపార్జన పద్దతిలో, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి స్వంత ప్రయత్నం ద్వారా పరిశ్రమించాలి. ఈ ఆరోహణ క్రమ పద్దతి కఠినమైనది, లోపభూయిష్టమైనది మరియు చాలా సమయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) నేర్చుకోవాలంటే, ఆరోహణ క్రమ పద్దతిలో ప్రయత్నించవచ్చు - ఈ పద్దతిలో మన సొంత తెలివితో ఆయా సూత్రాలను ఊహకల్పన చేసి ఒక అభిప్రాయానికి రావచ్చు; లేదా అవరోహణ పద్దతిలో నేర్చుకోవచ్చు – ఈ పద్దతిలో మనం ఒక ఫిజిక్స్ బాగా తెలిసిన ఉపాధ్యాయుడిని ఆశ్రయిస్తాము. ఆరోహణ క్రమ పద్దతి చాలా సమయం తీసుకుంటుంది, నిజానికి ఈ రకమైన అధ్యయనానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు; తుదకు తేలిన విషయాలు నిజమైనవో కాదో కూడా మనకు నమ్మకముండదు. పోల్చి చూస్తే, అవరోహణ క్రమ పద్దతి తో ఫిజిక్స్ లో ఉన్న నిగూఢ రహస్యాలు మనకు తక్షణమే తెలుస్తాయి. మన ఉపాధ్యాయుడికి ఫిజిక్స్ లో సంపూర్ణ జ్ఞానం ఉంటే ఇది చాలా సులువవుతుంది – ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో విని దాన్ని జీర్ణం చేసుకోవటమే మన పని. ఈ యొక్క అవరోహణ క్రమం లో ఉన్న జ్ఞాన సముపార్జన సులువైనది, దోషరహితమైనది.

ప్రతి సంవత్సరం కొన్ని వేల స్వయం-సహాయ (self-help) పుస్తకాలు విపణిలో విడుదలవుతాయి. అవి, జీవితం లో ఎదురయ్యే సమస్యలకు రచయిత యొక్క పరిష్కారాలను వివరిస్తాయి. ఈ పుస్తకాలు, ఒక పరిమితి లో సహాయపడచ్చు, కానీ ఇవి ఆరోహణ క్రమ పద్దతిలో పొందిన జ్ఞానం ఆధారంగా వ్రాయబడ్డాయి కాబట్టి అవి లోపభూయిష్టమయినవి. ప్రతి కొన్ని సంవత్సరాలకీ, ఎదో ఒక కొత్త సిద్ధాంతం వచ్చి ఆ సమయంలో ఉన్న వాటిని పక్కకి నెడుతుంది. ఈ యొక్క ఆరోహణ పద్దతి అనేది పరమ సత్యాన్ని తెలుసుకోవటానికి పనికిరాదు. దివ్య జ్ఞానాన్ని స్వీయ-పరిశ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. అది భగవంతుని యొక్క శక్తి, ఎలాగైతే అగ్ని ఉన్నప్పటి నుండీ దాని వెలుగు, వేడిమి ఉంటాయో , అది (దివ్య జ్ఞానం) భగవంతుడు ఉన్నప్పటి నుండీ ఉంది.

భగవంతుడు మరియు జీవాత్మ రెండూ కూడా సనాతనమైనవి, అలాగే జీవాత్మను భగవంతునితో కలిపే యోగ శాస్త్రము కూడా సనాతనమైనదే. దీని కోసం ఎదో ఊహించి, కొత్త కొత్త సిద్ధాంతాలను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యక్షసత్యం యొక్క అద్భుతమైన తార్కాణం, ఈ భగవద్గీత యే. ఇది చెప్పబడి యాభై శతాబ్దములు దాటినా, తనలో ఉన్న శాశ్వత/సనాతన జ్ఞాన ప్రజ్ఞతో, ఇది ఇప్పటికీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడుతూ, జనులను ఆశ్చర్య చకితులను చేస్తున్నది. తను అర్జునుడికి తెలియజేసే ఈ యోగ విద్య జ్ఞానం, సనాతనమైనది మరియు ప్రాచీన కాలంలో అవరోహణ క్రమంలో గురువు నుండి శిష్యుడికి పరంపరగా అందించబడింది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.