Bhagavad Gita: Chapter 4, Verse 2

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।

ఏవం — ఈ విధంగా; పరంపరా — పరంపరలో; ప్రాప్తమ్ — అందుకున్న; ఇమం — ఈ (శాస్త్రము); రాజ-ఋషయః — రాజర్షులు; విదుః — అర్థం చేసుకున్నారు; సః — అది; కాలేన — దీర్ఘ కాల గతిలో; ఇహ — ఈ లోకంలో; మహతా — చాలా; యోగః — యోగము; నష్టః — తరిగిపోవుట; పరంతప — అర్జునా, శత్రువులను తపింప చేయువాడా.

Translation

BG 4.2: ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది (క్షీణించి పోయినది).

Commentary

దివ్య ఆథ్యాత్మిక జ్ఞానాన్ని అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తి తెలిపే శాస్త్రాన్ని గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు, ఆ గురువు తన గురువు నుండి ఇలాగే అందుకున్నాడు. ఈ విధమైన సాంప్రదాయం లోనే రాజర్షులైన నిమి, జనకుడు యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సంప్రదాయం, ఆది-జగద్గురువైన భగవంతునితోనే మొదలయ్యింది.

తేనే బ్రహ్మ హృదాయ ఆది-కవయే ముహ్యంతి యత్ సూరయః

(భాగవతం 1.1.1)

ఈ శ్లోకం ప్రకారం, భగవంతుడు సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రధమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరిచాడు, ఆయన నుండి ఈ సంప్రదాయం కొనసాగింది. ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, సూర్యభగవానుడైన వివస్వానుడికి కూడా తాను ఈ జ్ఞానాన్ని తెలియపరిచినట్టు చెప్పాడు, ఆయన నుండి కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం ఎలాంటిదంటే, కాల క్రమంలో ఈ జ్ఞానం లుప్తమైపోయింది. ప్రాపంచిక మనస్తత్వంగల, కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథం పరంగా జ్ఞానాన్ని అన్వయిస్తారు. కొలది తరాల్లోనే ఆ జ్ఞానం యొక్క ప్రాచీన స్వచ్ఛత మలినమైపోయింది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం తిరిగి సుస్థిరపరుస్తాడు. ఆ పనిని తానే ఈ లోకంలో స్వయంగా అవతరించి గానీ లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ చేస్తాడు.

భారత చరిత్రలో ఐదవ మూల జగద్గురువైన, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు సనాతన జ్ఞానాన్ని ఇప్పటి కాలంలో తిరిగి ప్రతిపాదించి స్థిరపరిచిన, భగవత్-ప్రేరణ నొందిన, ఈ కోవకి చెందిన మహాత్ములు. పవిత్ర కాశీ నగరంలో, ఐదువందల మంది వేద-పండితులతో కూడిన అత్యున్నత సంస్థానమైన, కాశీ విద్వత్ పరిషత్తు, కేవలం ముప్పైనాలుగు సంవత్సరాల ప్రాయంలోనే జగద్గురువు అన్న బిరుదునిచ్చి వారిని సత్కరించింది. వారు ఆ విధంగా, భారత చరిత్రలో జగద్గురు శంకరాచార్య, జగద్గురు నింబార్కాచార్య, జగద్గురు రామానుజాచార్య, మరియు జగద్గురు మధ్వాచార్యుల తరువాత ‘జగద్గురువు’ అన్న బిరుదు నొందిన ఐదవ వారయ్యారు. భగవద్గీత యొక్క నిగూఢమైన భావాన్ని, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు నాకు తెలియచేసిన ప్రకారంగా, ఈ యొక్క గీతా వ్యాఖ్యానం వ్రాయబడింది.

Watch Swamiji Explain This Verse