Bhagavad Gita: Chapter 4, Verse 33

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।

శ్రేయాన్ — శ్రేష్ఠమైనది; ద్రవ్య-మయాత్ — భౌతిక సంపత్తి/ద్రవ్యములతో కూడిన; యజ్ఞాత్ — యజ్ఞము కంటెను; జ్ఞాన-యజ్ఞః — జ్ఞానముతో ఆచరింపబడే యజ్ఞము; పరంతప — శత్రువులను జయించేవాడా, అర్జునా; సర్వం — అన్నీ; కర్మ — పనులు; అఖిలం — సమస్త; పార్థ — అర్జునా, ప్రిథ పుతృడా; జ్ఞానే — జ్ఞానములో; పరిసమాప్యతే — పరిసమాప్తమగును.

Translation

BG 4.33: ఓ శత్రువులను లోబరుచుకొనే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును.

Commentary

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఇంతకు క్రితం వివరింపబడిన యజ్ఞములను సరియైన దృక్పథంలో పెడుతున్నాడు. శారీరకమైన భక్తి యుక్త కర్మలు చేయటం మంచిదే అయినా అవి సరిపోవు అని అర్జునుడుకి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్ర జపాలు, తీర్థ యాత్రలు, ఇవన్నీమంచివే, కానీ వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి అవి సరిపోవు.

చాలా మంది జనులు భగవన్నామాన్ని పూసలమీద జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లెవేస్తుంటారు, పవిత్ర ధామాలని సందర్శిస్తుంటారు మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు; ఇటువంటి భౌతిక/శారీరక క్రియల తోనే భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తుంటారు. కానీ, సంత్ కబీర్ ఈ భావాన్ని నిర్ద్వందంగా త్రోసిపుచ్చాడు.

మాలా ఫేరత యుగ ఫిరా, ఫిరా న మన కా ఫేర్
కర్ కా మనకా డారి కే, మనకా మనకా ఫేర్

‘ఓ ఆధ్యాత్మిక సాధకుడా, నీవు జప మాలలు చాలా కాలం నుండి తిప్పుతున్నావు, కానీ మనస్సు యొక్క చాంపాల్యం తరగలేదు. ఇక ఇప్పుడు ఆ పూసలు పక్కన పెట్టి మనస్సు యొక్క పూసలు తిప్పు.” జగద్గురు కృపాలు జీ మహారాజ్ ఇలా అన్నారు:

బంధన్ ఔర్ మోక్ష్ కా, కారణ్ మన హి బఖాన్
యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన్ తే హరిధ్యాన్ (భక్తి శతకం, 19వ శ్లోకం)

‘మోక్షానికి, కర్మ బంధనానికి కారణం మనస్సు మాత్రమే. ఏ విధమైన భక్తి చేసినా, నీ మనస్సుని మాత్రం భగవంతుని యందే లగ్నం చేయుము.’

జ్ఞాన సముపార్జనతో భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. ఉదాహరణకి, మీ పుట్టిన రోజు వేడుక జరుగుతోందనుకోండి, మరియు అతిధులు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారనుకోండి. ఎవరో వచ్చి మీకు ఒక పాత సంచి ఇచ్చారు. మీకు వచ్చిన ఇతర గొప్ప బహుమతులతో పోల్చితే, ఇదేదో పనికిమాలినదే అనుకోని దాని వైపు చిరాగ్గా చూస్తారు. ఆ వ్యక్తి మిమ్ములను ఆ సంచిలో చూడమన్నాడు. మీరు సంచి తెరిస్తే దానిలో రూ.2000 నోట్లు ఒక వంద ఉన్నాయి. మీరు వెంటనే ఆ సంచిని హత్తుకుని ‘అబ్బా, ఇదే నాకొచ్చిన అత్యుత్తమ బహుమానం!’ అనుకుంటారు. ఆ సంచిలో ఉన్నవి ఏమిటో అన్న జ్ఞానం, ఆ సంచి అంటే ప్రేమని పెంపొందించింది. ఇదే విధంగా, భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించు కోవటం వలన మన భక్తి భావన వృద్ధిచెందుతుంది. కాబట్టి, జ్ఞానంతో కూడిన యజ్ఞముల ఆచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞము కంటే ఉన్నతమైనదని శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక ఇప్పుడు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తున్నాడు.