Bhagavad Gita: Chapter 4, Verse 7

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।

యదా-యదా — ఎప్పుడెప్పుడైతే; హి — నిజముగా; ధర్మస్య — ధర్మము యొక్క; గ్లానిః — క్షీణత; భవతి — సంభవించునో; భారత — అర్జునా, భరత వంశీయుడా; అభ్యుత్థానమ్ — పెరుగుట; అధర్మస్య — అధర్మము యొక్క; తదా — అప్పుడు; ఆత్మానం — నన్ను; సృజామి — సృజింతును (ప్రకటించుకుందును); అహం — నేను.

Translation

BG 4.7: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.

Commentary

ధర్మము అంటే నిజానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పురోగతికి సహకరించే, విహిత కర్మలే; దీనికి విరుద్ధమే అధర్మం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్త, నిర్వహణాధికారి అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకొని, దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. ఈ అవతారం అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి (‘Avatar’) తీసుకోబడింది, ఇప్పటికాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్‌లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు. కానీ, ఈ భాష్యంలో ఈ పదాన్ని, దాని యొక్క నిజమైన అర్థంలో, అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడుదాము. శ్రీమద్భాగవతంలో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది. కానీ, భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి.

జన్మకర్మాభిధానాని సంతి మేఽoగ సహస్రశః
న శక్యంతే ఽనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి హి

(భాగవతం 10.51.37)

‘అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భగవత్ అవతారములను ఎవరూ గణించలేరు.’ క్రింద చెప్పబడినట్టు, ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:

1. ఆవేశావతారములు: ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టి మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం. నారద ముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ. బుద్ధుడు కూడా ఒక ఆవేశావతార ఉదాహరణ.

2. ప్రాభవావతారములు: భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులలో కొన్నింటిని ప్రదర్శించిన అవతారములు ఇవి. ప్రాభవావతారములు కూడా రెండు రకాలు.

భగవంతుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమై, తన కార్యాన్ని పూర్తిచేసి, వెళ్లిపోయేవి. హంసావతారము దీనికి ఒక ఉదాహరణ, దీనిలో కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.

భూలోకంలో చాలా ఏళ్లు కొనసాగే అవతారములు. పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతారమే.

3. వైభవావతారములు: తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారములు వైభావావతారముల ఉదాహరణలు.

4. పరావస్థావతారములు: భగవంతుడు తన సమస్త దివ్య శక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నృసింహావతారము - పరావస్థావతారముల ఉదాహరణలు.

ఈ వర్గీకరణ వల్ల, ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు. తనే ఒక అవతారమైన వేద వ్యాసుడు పద్మ పురాణంలో ఈ విధంగా చెప్పాడు: సర్వే పూర్ణాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరమాత్మనః ‘భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి; అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితమైనవి.’ కాబట్టి, మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు. ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. అందుకే, ఈ వ్యత్యాసములను వివరించటానికే పై వర్గీకరణ చేయబడింది.