Bhagavad Gita: Chapter 9, Verse 7-8

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ।। 7 ।।
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః ।
భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ।। 8 ।।

సర్వ-భూతాని — సమస్త ప్రాణులు; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ప్రకృతిం — ఆదిమ భౌతిక శక్తి; యాంతి — విలీనమవును; మామికామ్ — నా యొక్క; కల్ప-క్షయే — కల్పాంతరమున; పునః — మరల; తాని — వాటిని; కల్ప-ఆదౌ — కల్ప ప్రారంభమున; విసృజామి — వ్యక్తపరిచెదను; అహం — నేను; ప్రకృతిం — భౌతిక ప్రకృతి శక్తి; స్వాం — స్వయంగా నాదైన; అవష్టభ్య — ఆధీనములో ఉంచుకొని; విసృజామి — ఉత్పత్తిచేస్తాను; పునః పునః — మళ్లీ మళ్లీ; భూత-గ్రామం — విభిన్న రకాలైన (జీవరాశులు); ఇమం — ఇవి; కృత్స్నమ్ — సమస్తము; అవశం — వాటి ప్రమేయం లేకుండానే; ప్రకృతేః — ప్రకృతి; వశాత్ — వశమున.

Translation

BG 9.7-8: కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.

Commentary

శ్రీ కృష్ణుడు, క్రితం కొన్ని శ్లోకాలలో, సమస్త ప్రాణులు తనలోనే నివసిస్తున్నాయని వివరించి ఉన్నాడు. ఈ వాక్యాలు ఈ తదుపరి సందేహాన్ని కలిగించవచ్చు: ‘మహాప్రళయం సంభవించినప్పుడు, సమస్త జగత్తు లయం అయిపోయినప్పుడు, ఈ ప్రాణులన్నీ ఎక్కడికి పోతాయి?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఈ శ్లోకంలో ఇవ్వబడుతున్నది.

ఇంతకు క్రితం అధ్యాయంలో, 8.17వ నుండి 8.19వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, సృష్టి, స్థితి, మరియు లయము ఒక చక్రం లాగ ఎలా సంభవిస్తుంటాయో వివరించాడు. ఇక్కడ, కల్ప-క్షయ అంటే, ‘బ్రహ్మ దేవుని యొక్క జీవన కాలం ముగిసే సమయము’ అని అర్థము. బ్రహ్మ దేవుని జీవనకాలమైన వంద-సంవత్సరములు ముగిసేటప్పటికి, అంటే, భూలోకంలో 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరములు అయ్యేటప్పటికి, సమస్త విశ్వ సృష్టి లయమైపోతుంది మరియు అది అవ్యక్త స్థితి లోనికి వెళ్ళిపోతుంది. పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలలో విలీనమైపోతాయి; పంచ తన్మాత్రలు అహంకారంలో విలీనమైపోతాయి; అహంకారము మహాన్ లో విలీనమైపోతుంది; మహాన్, ప్రకృతిలో విలీనమైపోతుంది; ప్రకృతి అంటే ఆదిరూపమైన మూల భౌతిక శక్తి; మరియు ప్రకృతి వెళ్లి పరమేశ్వరుడైన మహా విష్ణువు ఉదరములో స్థితమై పోతుంది.

ఆ సమయంలో, భౌతిక సృష్టిలో ఉన్న సమస్త జీవాత్మలు కూడా వెళ్లి భగవంతుని శరీరంలో విరామంలో, అచేతనావస్థ స్థితిలో ఉంటాయి. వాటి స్థూల మరియు సూక్ష్మ శరీరాలు తమ మూలమైన, మాయలో విలీనమైపోతాయి. కానీ, కారణ శరీరము ఉండిపోతుంది. (ఈ మూడు రకముల శరీరముల గురించి 2.28వ శ్లోక వ్యాఖ్యానంలో వివరంగా చెప్పబడింది). ప్రళయ కాలం అయిపోయినప్పుడు, భగవంతుడు ఈ జగత్తుని మరల సృష్టించినప్పుడు, భౌతిక శక్తి, ఇక ఇందాక చెప్పిన దాని వ్యతిరేక దిశలో విచ్చుకోవటం ప్రారంభిస్తుంది: ప్రకృతి-మహాన్-అహంకారము-పంచ తన్మాత్రలు-పంచ మహాభూతాలు. అప్పుడు, అచేతనావస్థలో, కేవలం కారణ శరీరాలతో ఉన్న ఆత్మలు, తిరిగి జగత్తులోకి ప్రవేశపెట్టబడుతాయి. వాటివాటి కారణ శరీరాల అనుగుణంగా, వాటికి ఆయా సూక్ష్మ, స్థూల శరీరాలు ఇవ్వబడుతాయి, మరియు ఈ విశ్వంలో వివిధ రకాలైన జీవ స్వరూపాలు సృష్టించబడుతాయి. ఈ జీవ స్వరూపాలు, వేర్వేరు లోకాలలో వేర్వేరు స్వభావాలతో ఉంటాయి. భూలోకంలో భూమి మరియు నీరు ప్రబలమైన శరీర మూలకాల గా ఉన్నట్టు, కొన్ని గ్రహాల్లో, అగ్ని అనేది ప్రబలమైన మూలకముగా ఉంటుంది. కాబట్టి, శరీరములు తమ సూక్ష్మతత్వంలో మరియు తమ శక్తి సామర్థ్యాలలో వివిధ రకాలుగా ఉంటాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అసంఖ్యాకమైన జీవ రూపాలు అని పేర్కొన్నాడు.