Bhagavad Gita: Chapter 18, Verse 63

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ।। 63 ।।

ఇతి — ఈ విధముగా; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; ఆఖ్యాతం — వివరించబడినది; గుహ్యాత్ — రహస్య జ్ఞానము కంటే; గుహ్య-తరం — ఇంకా రహస్యమైన జ్ఞానము; మయా — నా చేత; విమృశ్య — బాగా ఆలోచించి; ఏతత్ — దానిపై; అశేషేణ — పూర్తిగా; యథా — ఎట్లయితే; ఇచ్ఛసి — ఇష్టమైతే; తథా — ఆ విధముగా; కురు — చేయుము.

Translation

BG 18.63: ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.

Commentary

రహస్యము అంటే అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానము అని అర్థం. భౌతిక శాస్త్రము (ఫిజిక్స్) యొక్క చాలా మటుకు సిద్ధాంతాలు కొన్ని శతాబ్దాలవరకూ రహస్యముగా ఉండేవి, ఇంకా చాలా సూత్రాలు రహస్యముగానే ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానమనేది చాలా నిగూఢమయినది, అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి, అది రహస్యము అని చెప్పబడినది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును తెలియచేసాడు, అది 'గుహ్యము' అంటే రహస్య జ్ఞానము. 7వ మరియు 8వ అధ్యాయాలలో, తన శక్తిసామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియచేసాడు, అది 'గుహ్యతరం', అంటే మరింత రహస్యమైనది. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో, తన భక్తి గురించి తెలియచేసాడు, అది 'గుహ్యతమం' అంటే అత్యంత రహస్యమైనది. ప్రస్తుత అధ్యాయములో, 55వ శ్లోకములో, తనను తన సాకార రూపములో తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యము అని తెలియచెప్పాడు. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు భగవద్గీతను ముగిస్తున్నాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియ చేస్తూ, 18 అధ్యాయాలలో చాలా మేర తానే మాట్లాడిన శ్రీకృష్ణుడు, ఇక ఇప్పుడు, ఏమి చేయాలి అనే నిర్ణయాన్ని అర్జునుడికే వదిలేస్తున్నాడు. ఆయన అంటున్నారు, ‘నేను నీకు గంభీరమైన మరియు గోప్యమైన జ్ఞానమును అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం.’ అని.

అయోధ్యావాసులకు, శ్రీ రామచంద్ర ప్రభువు సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఓసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో, రాముడు వారందరికీ, మానవ జీవిత లక్ష్యం ఏమిటి మరియు దానిని ఎలా సాధించాలి అని చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు

నహీఁ అనీతి నహీఁ కఛు ప్రభుతాఈ,

సునహు కరహు జో తుమ్హహి సోహాఈ (రామాయణం)

‘నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు మరియు నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరం లేదు. దానిని జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి.’

అందుబాటులో ఉన్నవాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలి అనే, ఈ యొక్క స్వేచ్ఛాచిత్తమును (ఎంచుకొనే స్వేచ్ఛ) భగవంతుడు, జీవునకు ఇచ్చాడు. ఈ స్వేచ్ఛాచిత్తమునకు పరిమితులు ఉన్నాయి. ఎవరైనా, ‘నేను ప్రపంచంలో అత్యంత తెలివికల వ్యక్తిగా ఉందామనుకుంటున్నాను.’ అని వారికివారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే, మనకున్న ఎంపిక పరిధి లోనివి (options) పరిమితంగా ఉంటాయి. కానీ, మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకొనే స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు ఏమంటారంటే, భగవంతుడు మనకు స్వేచ్ఛాచిత్తమును అసలు ఇవ్వకపోతే, మనం ఏమీ చెడుపనులు చేసి ఉండేవాళ్ళం కాదుకదా అంటారు. అలాఐతే, మనం ఏమీ మంచి కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరీ ముఖ్యంగా, భగవంతుడు, మనం ఆయనను ప్రేమించాలని కోరుకుంటాడు మరియు స్వేచ్ఛాచిత్తఎంపిక ఉన్నప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము అనేది ఎప్పుడూ ప్రేమించలేదు ఎందుకంటే దానికి స్వేచ్ఛాచిత్తము ఉండదు. భగవంతుడు మనలను స్వేచ్ఛాచిత్తము తోటే సృష్టించాడు మరియు ఎన్నో విషయాలను/పద్ధతులను ఎంచుకునే అవకాశాలను కలిగించాడు; ఇదంతా మనం ఆయననే ఎంచుకుని, ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచు కోవటానికే. సర్వ శక్తిమంతుడయిన భగవానుడు కూడా, జీవుడిని (జీవాత్మ) తనను ప్రేమించి, తనకు శరణువేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం, జీవుడే స్వయముగా తీసుకోవాలి. ఇక్కడ, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛాచిత్తమును గుర్తుచేస్తూ, అర్జునుడిని ఎంచుకోమని చెప్తున్నాడు.