Bhagavad Gita: Chapter 18, Verse 48

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ।। 48 ।।

సహ-జం — సహజ స్వభావంచే జనితమైన; కర్మ — కర్తవ్యము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; స-దోషం — దోషములతో కూడి ఉన్న; అపి — అయినాసరే; న త్యజేత్ — విడిచిపెట్టవద్దు; సర్వ-ఆరంభాః — అన్ని ప్రయత్నాలు; హి — నిజముగా; దోషేణ — దోషపూరితమై; ధూమేన — పొగతో; అగ్నిః — అగ్ని; ఇవ — అలాగా; ఆవృతాః — ఆవరింపబడి.

Translation

BG 18.48: తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.

Commentary

ఏదో దోషము చూడటం వలన జనులు కొన్నిసార్లు తమ కర్తవ్యము నుండి వెనుతిరుగుతారు. అగ్నిపై సహజంగానే పొగ ఆవరింపబడి ఉన్నట్టు ఏ పని కూడా సంపూర్ణ దోషరహితముగా ఉండదని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఉదాహరణకి, కోట్లాది సూక్ష్మ క్రిములను చంపకుండా మనం శ్వాస కూడా తీసుకోలేము. ఒకవేళ నేల దున్ని వ్యవసాయం చేస్తే అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులని నాశనం చేస్తాము. వ్యాపారంలో పోటీకి ఎదుర్కొని విజయం సాధిస్తే, ఇతరులకు సంపద లేకుండా చేస్తాము. ఒకవేళ మనం భుజిస్తే, ఇంకొకరికి ఆహరం లేకుండా చేసినట్టవుతుంది. స్వ-ధర్మము అంటే కార్యకలాపాలు చేయటం కాబట్టి అది సంపూర్ణ దోషరహితముగా ఉండజాలదు.

కానీ స్వ-ధర్మ పాలన యొక్క ప్రయోజనాలు దాని దోషములకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, అది మనుష్యులకు, తమ పరిశుద్ధికి మరియు ఉన్నతికి, ఒక సహజమైన అనాయాస మార్గమును అందిస్తుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడు మార్క్ అల్బియాన్ (professor Mark Albion), తన పుస్తకం మేకింగ్ ఎ లైఫ్, మేకింగ్ ఎ లివింగ్, (Making a Life, Making a Living) లో 1500 మంది, 1960-1980 కాలంలో బిసినెస్ కోర్సు పూర్తిచేసిన పట్టభద్రుల వారి జీవన ప్రగతి అధ్యయనం చేసిన విశేషాలను పొందుపరిచారు. ప్రారంభం నుండి, పట్టభద్రులను రెండు రకాల వర్గములుగా వేరుచేశారు. A-వర్గం లో వారు మొదట డబ్బులు సంపాదించి, ఆర్ధిక అవసరాలు తీరిన పిదప, ఆ తరువాత వారికి నిజంగా నచ్చిన పని చేస్తామని చెప్పారు. 83% మంది ఈ వర్గంలోకే వచ్చారు. B-వర్గంలో వారు, మొదట తమ ఆసక్తి ఉన్న, నచ్చిన ఆశయాలను కొనసాగిస్తాము, డబ్బులు వాటికవే వస్తాయి అని చెప్పారు. 17% మంది ఈ వర్గం లోకి వచ్చారు. 20 సంవత్సరముల తరువాత, మొత్తం 101 మంది కోటీశ్వరులయ్యారు. అందులో A-వర్గం వారినుండి (మొదట డబ్బు సాధిస్తాం అన్నవారు) ఒకరు, మిగతా 100 మంది B-వర్గం (మొదటినుండే తమకు ఇష్టమైన దాన్ని చేసినవారు) వారు ఉన్నారు. ధనవంతులు అయిన వారిలో అత్యధిక మంది, తమకు బాగా నచ్చిన/సరిపోయే వృత్తిని ఎంచుకోవటం వల్లనే ఆ సాఫల్యం సాధించగలిగారు. మార్క్ అల్బియాన్ చివరగా ఏమని ముగించాడంటే, చాలామందికి పని మరియు ఆట(వినోదం) వేర్వేరుగా ఉంటుంది. కానీ, వారికే నచ్చే పని చేస్తుంటే, అప్పుడు పనే ఒక ఆట(వినోదము) అయిపోతుంది, మరియు ఏరోజూ నిజముగా 'పని' చేయనవసరం లేదు. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునుడిని చేయమని చెప్పేది - తన స్వభావానికి బాగా సరిపోయే పనిని విడిచిపెట్టవద్దు అని అంటున్నాడు; దానిలో దోషములు ఉన్నాసరే, తన సహజమైన స్వభావానికి అనుగుణంగా కర్మలు చేయమంటున్నాడు. కానీ, ఉన్నతి కావాలంటే పనిని, తదుపరి శ్లోకములో వివరించిన సరియైన దృక్పథంలో చేయాలి.