అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; నష్టః — నిర్మూలించబడినది; మోహ — భ్రాంతి; స్మృతిః — స్మృతి; లబ్దా — తిరిగిపొందాను; త్వత్-ప్రసాదాత్ — నీ కృపచే; మయా — నా చేత; అచ్యుత — శ్రీ కృష్ణ, దోషరహితుడా; స్థితః — స్థితమై ఉండి; అస్మి — నేను; గత-సందేహః — సందేహములు లేకుండా; కరిష్యే — నేను చేస్తాను; వచనం — ఉపదేశములు; తవ — నీ యొక్క.
Translation
BG 18.73: అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
Commentary
ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు, మరియు ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. దుఃఖము/శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదు అని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు, మరియు తనకు జ్ఞానోదయమయినది అని, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తం లేదు అని ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకొని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధముగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు; అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు, నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించింది.’ అని.
భౌతిక జ్ఞాన సముపార్జనకు కృప అవసరం లేదు. మనం ఆ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ, డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము లేదా అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది మరియు విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతని అహంకార దృక్పథంతో చేరితే, ‘నేను చాలా తెలివికలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతాను’ అని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దాన్ని పట్టుకొని దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి, మరియు గత ఐదు వేల సంవత్సరాలలో ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు, కానీ వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశం, ఆయన కృపచే, అర్థమవుతుంది.