జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ।। 18 ।।
జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞాన విషయము; పరిజ్ఞాతా — తెలుసుకొనువాడు (జ్ఞాత); త్రివిధా — మూడు విధములు; కర్మ-చోదనా — కర్మను ప్రేరేపించునవి; కరణం — కర్మకు ఉన్న ఉపకరణములు; కర్మ — కర్మ (పని); కర్తా — కర్త (చేసేవాడు); ఇతి — ఈ విధముగా; త్రి-విధః — మూడు రకముల; కర్మ-సంగ్రహః — కర్మ యొక్క అంగములు.
Translation
BG 18.18: జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడు కర్మ యొక్క అంగములు.
Commentary
కర్మ శాస్త్రము విషయంపై, ఒక చక్కటి పద్ధతి ప్రకారం ఉన్న తన విశ్లేషణలో, శ్రీ కృష్ణుడు దాని యొక్క అంగములను వివరించి ఉన్నాడు. చేసే పనుల యొక్క కర్మ ప్రతిఫలములను కూడా వివరించాడు మరియు కర్మ ప్రతిచర్యల నుండి ఎలా విముక్తి అవ్వచ్చో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు, కర్మను ప్రేరేపించే మూడు రకముల కారకములను వివరిస్తున్నాడు. అవి, జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), మరియు జ్ఞాత (జ్ఞానమును తెలిసినవాడు). ఈ మూడింటినీ కలిపి, 'జ్ఞాన త్రిపుతీ' అని అంటారు.
‘జ్ఞానము’ అనేది కర్మకు ప్రధానమైన ప్రేరణను ఇచ్చేది; అది ‘జ్ఞాత’కు, ‘జ్ఞేయము’ను గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఈ మూడు కలిపి కర్మను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకి, పనిచేసే సంస్థ ఇచ్చే జీతము యొక్క జ్ఞానమే, ఉద్యోగులకు పనిచేసే ప్రేరణ ఇస్తుంది; ప్రపంచంలో ఎన్నో చోట్ల, బంగారము లభిస్తున్నదనే సమాచారమే ఎంతో మంది కూలీలు ఆయా ప్రాంతాలకు వలసపోయేటట్లు చేసింది; ఒలింపిక్స్ లో పతకం గెలవటం యొక్క ప్రాముఖ్యత తెలవటం వలననే ఎంతో మంది ఆటగాళ్ళు సంవత్సరాల తరబడి అభ్యాసం చేసేందుకు ప్రేరణను కలిగిస్తుంది. పని యొక్క నైపుణ్యం పై కూడా ఈ జ్ఞాన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, ప్రముఖ విద్యాసంస్థ నుండి పొందిన పట్టాకి ఉద్యోగ వేటలో ఎక్కువ విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి జ్ఞానం కలవారు పనిని చక్కగా చేస్తారు అని పారిశ్రామిక సంస్థలు తెలుసుకున్నాయి. అందుకే, ప్రఖ్యాత సంస్థలు తమ ఉద్యోగుల జ్ఞాన అభ్యున్నతికి బాగా ఖర్చు పెడతాయి, ఉదాహరణకి ఉద్యోగులను, వారి నైపుణ్యం పెంచుకోవటానికి ఉన్నత-శిక్షణా తరగతులకు (developmental seminars) పంపిస్తూ ఉంటాయి.
రెండవ సమూహాన్ని, 'కర్మ త్రిపుతీ' అని అంటారు. దానిలో ఉండేవి - కర్త (చేసేవాడు), కారణము (కర్మ యొక్క ఉపకరణము), మరియు కర్మ (ఆ పని). ఈ మూడు కలిపి కర్మ అంగములు అని అనుకోవచ్చు. 'కర్త' అనేవాడు 'కారణము' ను ఉపయోగించుకొని, 'కర్మ' ను చేస్తాడు. కర్మ యొక్క అంగములను వివరించిన పిదప శ్రీ కృష్ణుడు ఇక వాటిని ప్రకృతి త్రిగుణములతో అనుసంధానం చేస్తాడు; జనులు ఒకరి కంటే ఇంకొకరు భిన్నముగా తమ కర్మలలో, ప్రేరణలో వివిధ రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తారో ఇది మనకు తెలియచేస్తుంది.