Bhagavad Gita: Chapter 18, Verse 66

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।

సర్వ-ధర్మాన్ — అన్ని విధములైన ధర్మములనూ; పరిత్యజ్య — విడిచిపెట్టి; మామ్ — నా యందు; ఏకం — మాత్రమే; శరణం — ఆశ్రయం; వ్రజ — పొందుము; అహం — నేను; త్వాం — నిన్ను; సర్వ — సమస్తమైన; పాపేభ్యః — పాప ప్రతిచర్యలనుండి; మోక్షయిష్యామి — విముక్తి చేసెదను; మా శుచః — భయపడకుము.

Translation

BG 18.66: అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.

Commentary

ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకేసమయంలో రెండు పనులు చేయమన్నాడు - మనస్సుని భక్తిలో నిమగ్నం చేయాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు, దానితో పాటుగా భక్తి చేయమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెప్తూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా అవసరంలేదు అని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చు అన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. ఇక్కడ, ఒక సందేహం రావచ్చు, మనం మన భౌతిక ధర్మములను అన్నింటినీ విడిచి పెడితే, మనకు పాపం కలుగదా? శ్రీ కృష్ణుడు అర్జునుడికి భయపడవద్దని చెప్తున్నాడు; ఆయన అర్జునుడిని సమస్త పాపముల నుండి విముక్తి చేస్తాడు, మరియు భౌతిక అస్తిత్వం నుండి విముక్తి చేస్తాడు.

శ్రీ కృష్ణుడి యొక్క ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి, మనం 'ధర్మము' అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి. అది 'ధృ' అన్న ధాతువు నుండి వచ్చింది, అంటే ‘ధారణ్ కరనే యోగ్య’ '(dhāraṇ karane yogya') అంటే ‘మనకు సముచితమైన/చేయవలసిన బాధ్యతలు, విధులు, తలంపులు, మరియు కర్మలు.’ యధార్థముగా మనకు రెండు రకాల ధర్మములు ఉన్నాయి - భౌతిక ధర్మములు మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటో ఉన్న, రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనల్ని ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవి అన్నీ శారీరక ధర్మములు అంటారు. దీనినే 'అపర ధర్మ' లేదా ప్రాపంచిక ధర్మ అంటారు. దీని పరిధిలోనే, బ్ర్రాహ్మణ ధర్మ, క్షత్రియ ధర్మ, మొదలైనవి అన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనల్ని ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి/సఖుడు, మరియు ఆశ్రయము అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మ, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మ లేదా ఆధ్యాత్మిక ధర్మ అంటారు.

ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే అది పాపము కాదు. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది:

దేవర్షి-భూతాప్త-నృణాం పితౄణాం

న కింకరో నాయం ఋణీ చ రాజన్
సర్వాత్మనా యః శరణం శరణ్యం

గతో ముకుందం పరిహృత్య కర్తమ్ (11.5.41)

ఈ శ్లోకం ఏమి చెప్తున్నది అంటే, భగవంతునికి శరణాగతి చేయనివారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనలని మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్నపూర్వకంగానే (ఆటోమేటిక్‌గా) ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడుతాము; ఇదిఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే అందరి పట్ల మన విధి నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యము ఏమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది :

ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టాన్ అపి స్వకాన్
ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః (11.11.32)

‘శారీరక ధర్మమును పాటించటం గురించి, వేదములలో, నేను అసంఖ్యాకమైన ఉపదేశాలను ఇచ్చి ఉన్నాను. కానీ, ఎవరైతే వీటిలో ఉన్న అసంపూర్ణతను గమనించి, అన్ని కర్తవ్య విధులను త్యజించి, కేవలం నా యందు భక్తి యుక్త సేవలో నిమగ్నమైతే, వారిని నేను ఉత్తమ సాధకులుగా పరిగణిస్తాను’. రామాయణములో, లక్ష్మణుడు ఏ విధంగా, సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచి, రాముడితో పాటు అడవికి ఎలా వెళ్ళాడో మనం చదివి ఉన్నాము. ఆయన అన్నాడు:

గురు పితు మాతు న జానహు కాహూ, కహహు సుభాఉ నాథ పతియాఊ
మోరె సబహీఁ ఏక తుమ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ

‘ఓ ప్రభూ, నన్ను దయచేసి నమ్మండి, నాకు ఎటువంటి గురువు, తండ్రి, తల్లి, బంధువులు ఎవరూ లేరు. నాకు సంబంధించినంత వరకూ, దీనబంధువు, మనస్సు ఎఱిగినవాడవు అయిన నీవే, నా స్వామివి మరియు నా సర్వస్వమూ నీవే.’ అదే విధంగా, ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు:

మాతా నాస్తి పితా నాస్తి నాస్తి మే స్వజనో జనః

‘నాకు ఎవరూ తల్లి, తండ్రి, లేదా బంధువులు ఎవరూ లేరు (భగవంతుడే నాకు అన్నీ).’

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు, అంటే, క్షత్రియ యోధుడిగా తన భౌతికప్రాపంచిక ధర్మము (2.31వ శ్లోకం). కానీ, భౌతిక ధర్మ అనేది భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు, మరియు పుణ్యక్షయం అయిపోయినప్పుడు జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి, శ్రీ కృష్ణుడు తదుపరి, అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు, అంటే, శరీరముతో భౌతిక ధర్మము మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. (8.7వ శ్లోకం). ఈ కర్మయోగ ఉపదేశమే భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు, అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మ, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు; అందుకే, యుద్ధం చేయాలి, కానీ అది తన క్షత్రియ ధర్మము కాబట్టి కాదు, భగవంతుడు తనను అలాగే చేయమంటున్నాడు కాబట్టి.

మరైతే, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశాన్ని ప్రారంభంలోనే ఎందుకు చెప్పలేదు? ఎందుకు స్పష్టంగా దీనికి విరుద్ధంగా 5.2వ శ్లోకములో కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనది అని చెప్పాడు? శ్రీ కృష్ణ భగవానుడు దీనిని స్పష్టంగా తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.