Bhagavad Gita: Chapter 18, Verse 62

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।।

తమ్ ఏవ — ఆయనకు మాత్రమే; శరణం గచ్ఛ — శరణాగతి చేయుము; సర్వ-భావేన — సంపూర్ణముగా; (హృదయపూర్వకముగా); భారత — అర్జునా, భరత వంశీయుడా; తత్-ప్రసాదాత్ — ఆయన కృపచేత; పరాం — సర్వోత్కృష్ట; శాంతిం — శాంతి; స్థానం — స్థానము/ధామము; ప్రాప్స్యసి — నీవు పొందెదవు; శాశ్వతం — నిత్యశాశ్వతమైన.

Translation

BG 18.62: సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.

Commentary

భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికి మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి, కూడా, ఆయన కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దానికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమును మరియు దివ్య ఆనందమును ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు మరియు దానిని భౌతిక శక్తి మాయా బంధముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడు అని శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి, జీవాత్మ భగవత్ శరణాగతి ద్వారా అర్హత సంపాదించుకోవాలి. ఒక ఈలోకపు తండ్రి కూడా, తన విలువైన సంపత్తిని, తన కొడుకు ప్రయోజకుడై వాటిని భాద్యతతో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది ఎదో ఆషామాషీ వ్యవహారం కాదు, దానిని ప్రసాదించటానికి సంపుర్ణ సహేతుక తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి.

ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటానికి నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. ఉదాహరణకు ఇలా అనుకోండి: ఒకాయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరినీ పొలంలో కష్టపడి పనిచేయమని ఆయన పంపించాడు. ఒక కొడుకు, ఎండలో రోజంతా శ్రమించి చెమటోడ్చి పనిచేస్తాడు. రాత్రికి అతడు తిరిగొచ్చినప్పుడు, ఆ తండ్రి ఇలా అంటాడు, "చాలా బాగా పనిచేసావు నాయనా, నీవు కష్టపడ్డావు, చెప్పినట్టు విన్నావు మరియు విశ్వాసం తో పని చేసావు. నీ బహుమానం ఇదిగో, ఈ $500 తీసుకుని నీ ఇష్టానికి వాడుకో." అని. అదే సమయంలో, ఆ రెండవ కొడుకు ఏమీ చేయడు - రోజంతా మంచంపై పడుకుంటాడు, త్రాగుతూ, ధూమపానం చేస్తూ మరియు తండ్రిని దూషిస్తూ ఉంటాడు. ఒకవేళ రాత్రికి ఆ తండ్రి ఇలా అంటే,"పోనీలే, ఏదేమైనా నీవు కూడా నా కొడుకువే కదా, ఇదిగో $500 తీసుకో, నీ ఇష్టప్రకారం వాడుకో" , దీని పరిణామం ఏమిటంటే, ఆ మొదటి కొడుకు యొక్క కష్టపడి పనిచేసే తత్త్వం, ఉత్సాహం దెబ్బ తింటుంది. అతను అంటాడు, "నా తండ్రి యొక్క కృప ఈ రకంగా ఉంటే, నేను కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏముంది? నేను కూడా ఏమీ చేయకుండా ఉంటా, నాక్కూడా $500 ఎలాగూ వస్తుంది." అని. అదే విధంగా, భగవంతుడు తన కృపను మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు కూడా ఇలాగే అంటారు , "ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము, ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే ఆయనకి కృప లభించినది. అలా అయితే ఆత్మ-ఉద్దరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది." అని. భగవంతుడు అంటాడు, "నేను ఇలా అస్తవ్యస్తంగా వ్యవహరించను. నేను కృప ప్రసాదించటానిని నాదొక సనాతనమైన నియమం ఉన్నది. నేను దీనిని అన్ని శాస్త్రాలలో తెలియచేసాను." అని. శ్వేతాశ్వతర్ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తం హ దేవం ఆత్మ-బుద్ధి-ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే (6.18)

"ఆ బ్రహ్మ దేవుడిని మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచే ఆత్మ మరియు బుద్ధి జ్ఞానప్రకాశితమవుతాయి."

శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:

మాం ఏకం ఏవ శరణం ఆత్మానం సర్వదేహినామ్
యాహి సర్వాత్మ-భావేన మయా స్యా హ్యకుతోభయః (11.12.15)

"ఓ ఉద్దవా! సమస్త ప్రాపంచిక సామాజిక ఆచారాలనూ విడిచిపెట్టి, కేవలం, అన్ని ఆత్మలకు పరమాత్మ అయిన నాకు, శరణాగతి చేయుము. అప్పుడే నీవు ఈ భౌతిక భవ సాగరాన్ని దాటి, భయరహితుడవు కావచ్చు."

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో 7.14వ శ్లోకం లో ఇలా పేర్కొన్నాడు : "ప్రకృతి త్రిగుణములతో కూడి ఉన్న నా యొక్క దైవీ శక్తి, 'మాయ', అధిగమించటానికి చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసినవారు, దానిని సునాయాసముగా దాటిపోగలరు."

రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది:

సనముఖ హోఇ జీవ మోహి జబహీం. జన్మ కోటి అఘ నాసహిం తబహీం

"భగవత్ శరణాగతి చేసిన మరుక్షణం, జీవాత్మకు, దాని అనంతమైన పూర్వ జన్మల పాపరాశి, ఆయన కృపచే, భస్మమై పోతుంది."

ఈ పై భగవద్గీత శ్లోకములో, శ్రీ కృష్ణుడు , జీవుడు తన కృపకు పాత్రుడు కావటానికి, తనకు శరణాగతి చేయటం ఎంత ఆవశ్యకమో మళ్ళీ పేర్కొన్నాడు. ఈ శరణాగతి చేయటం అంటే, నిజానికి ఏమి చేయాలో అనే వివరాలు, హరి భక్తి విలాస్, భక్తి రాసామృత సింధు, వాయు పురాణం మరియు అహిర్బుధ్ని సంహిత లో ఈ క్రింది విధంగా చెప్పబడినది:

ఆనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం
రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా
ఆత్మనిక్షేప  కార్పణ్యే షడ్విధా శరణాగతిః

(హరి భక్తి విలాస్ 11.676)

ఈపై శ్లోకం భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములను వివరిస్తున్నది:

1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించుట: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము, మరియు తన స్వామి కోరికని తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తుల వలె, మన ఇష్టాన్ని, భగవంతుని ఇష్టముతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది (శరణాగతి) చేస్తుంది. ఆ వీచేగాలి, దానిని పైకిలేపినా, ముందుకు/వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా - దానికి ఏమీ పట్టదు. అదేవిధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందముగా ఉండాలి.

2. భగవంతుని ఇష్టానికి (సంకల్పమునకు) వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండుట. మన జీవితంలో మనకు సంక్రమించింది అంతా మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. అయినా, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని నోట్ చేసుకుని వాటి ఫలములను సరియైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా, జనులకు సంపద, కీర్తి, ఆనందము మరియు విలాసాలు లభించినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, భగవంతుడిని నిందిస్తారు, "ఎందుకు భగవంతుడు ఇలా చేసాడు?" అని. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల ఎటువంటి అసంతృపి/ఫిర్యాదులు ఉండకపోవటం.

3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడు అన్న ధృఢ విశ్వాసం కలిగి ఉండటం. భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి, అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహరం సమకూర్చిపెడుతూనే ఉంటాడు. అదేసమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా తన బిడ్డల అవసరాలు అన్నీ తీరుస్తాడు. మరిఅయితే, మన నిత్యసనాతన తండ్రి అయిన భగవానుడు మన సంరక్షణ చూసుకోడు అన్న సందేహం ఎందుకు? ఆయన రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము.

4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండుట. మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనము నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలెనే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిఇచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా ఆయనకు మనం ఏమీ పన్నులు (టాక్స్) కట్టడంలేదు, కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము.

దీనికి విరుద్ధమైనది, కృతజ్ఞతలేనితనము. ఉదాహరణకి, ఓ తండ్రి తన బిడ్డ కోసం ఎంతో చేస్తాడు. ఆ బిడ్డకి తండ్రి పట్ల కృతజ్ఞత తో ఉండమని చెప్తారు. కానీ, ఆ పిల్లవాడు ఇలా అంటాడు, "నేనెందుకు కృతజ్ఞతతో ఉండాలి? ఆయన తండ్రి ఆయనను చూసుకున్నాడు, ఈయన నన్ను చూసుకుంటున్నాడు." అని. ఇది ఈ లోకపు తండ్రి పట్ల కృతజ్ఞత లేకపోవటం. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము.

5. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించుట. భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు. అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికి ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినది అని అనుకుంటే భగవంతుని యొక్క యజమానిత్వమును మర్చిపోయినట్టే. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి. ఆ వచ్చిన ఆయన మీ బట్టలు వేసుకున్నాడు, రెఫ్రిజిరేటర్ నుండి పదార్ధాలు తీసుకున్నాడు, వాటిని తిని, మరియు ఆ పరుపుపై పడుకున్నాడు అనుకోండి. తిరిగి వచ్చాక, మీరు ఆగ్రహంతో అంటారు , "మా ఇంట్లో ఏం చేస్తున్నావు?" ఆయన అంటాడు, "నేను ఏమి పాడు చేయలేదు. నేను కేవలం అన్నింటిని సరిగా వాడుకున్నాను అంతే. దానికే ఎందుకింత ఇదై పోతున్నావు ? " అని. మీరు అంటారు, "నీవు ఏమీ పాడు చేయకపోయి ఉండవచ్చు, కానీ ఇదంతా నాకు చెందినది. నా అనుమతి లేకుండా వాడుకుంటే, నీవు దొంగవే అవుతావు." అని. అదే విధంగా, ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని మన యజమానిత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము.

6. శరణాగతి చేసాను అన్న అహంకారమును కూడా విడిచిపెట్టుట. ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వమే మన చేసిన మంచి పనిని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత మరియు విధేయత ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. "నేను ఏదైనా మంచి పని చేయగలిగాను అంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే, అని భావించాలి. నామటుకు నేనే అయితే నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు." ఇటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే శరణాగతి యొక్క ఆరవ అంగము.

ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములను పరిపూర్ణముగా సాధిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే , మరియు అయన మనపై తన కృప ప్రసాదిస్తాడు.