Bhagavad Gita: Chapter 1, Verse 1

ధృతరాష్ట్ర ఉవాచ ।
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।

ధృతరాష్ట్ర ఉవాచ — ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే — ధర్మ భూమి; కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద; సమవేతాః — చేరియున్న; యుయుత్సవః — యుద్ధ కాంక్షతో; మామకాః — నా పుత్రులు; పాండవా — పాండు పుత్రులు; చ — మరియు; ఏవ — నిజముగా; కిం — ఏమి; అకుర్వత — చేసినారు; సంజయ — ఓ సంజయా.

Translation

BG 1.1: ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?

Commentary

ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డి వాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించిన వాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి, న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండు పుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన, అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్టు చేసింది, అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు.

ఈ శ్లోకంలో, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే, యుద్ధభూమిలో కూడి ఉండి, తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమి చేసారు? అని. ఇప్పుడు, యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి, వారందరూ ఏమి చేసారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది?

అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు—ధర్మక్షేత్రే, అంటే, ధర్మ భూమి. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. యజుర్వేదం లోని శతపథ బ్రహ్మన్, యందు ఇలా చెప్పబడింది: కురుక్షేత్రం దేవ యజనం. ‘కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం.’ కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్లచేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాప-పుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈవిధంగా ఆలోచించి, వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తన కుమారులు శాంతి-ఒప్పందం కుదుర్చుకుంటే, పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు. కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు. అదే సమయంలో, యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో, తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే ఇరుసైన్యాలు సన్నద్ధమైయున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు.

Watch Swamiji Explain This Verse