Bhagavad Gita: Chapter 2, Verse 3

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 3 ।।

క్లైబ్యం — పౌరుషహీనత్వం; మా స్మ — వద్దు; గమః — లొంగిపోవద్దు; పార్థ — అర్జున, ప్రిథ తనయుడా; న — కాదు; ఏతత్ — ఇది; త్వయి — నీకు; ఉపపద్యతే — తగదు; క్షుద్రం — నీచమైన; హృదయ — హృదయ; దౌర్బల్యం — బలహీనత; త్యక్త్వా — వదిలిపెట్టి; ఉత్తిష్ట — లెమ్ము; పరంతప — శత్రువులను జయించేవాడా.

Translation

BG 2.3: ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.

Commentary

జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, మరియు సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు.

అర్జునుడిని, ప్రిథ (కుంతీదేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించింది, మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. కాబట్టి, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల అర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపు చేత, ఆ శత్రువు గోచరిస్తున్నది.

అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్తభ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు ఇక విశదీకరిస్తాడు. దీని మూలకారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.

Watch Swamiji Explain This Verse