Bhagavad Gita: Chapter 2, Verse 38

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।

సుఖ — సుఖము; దుఃఖే — దుఃఖములో; సమే కృత్వా — సమానముగా భావించి; లాభ-అలాభౌ — లాభ నష్టములు; జయ-అజయౌ — గెలుపు ఓటములు; తతః — అ తరువాత; యుద్ధాయ — యుద్ధమునకు; యుజ్యస్వ — సిద్దుడవు అవుము; న — కాదు; ఏవం — ఈ విధముగా; పాపం — పాపము; అవాప్స్యసి — పొందెదవు.

Translation

BG 2.38: సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.

Commentary

లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్నినిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు. పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది.

స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు, మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మఫలితాలను (ప్రతిచర్యలు) కలుగచేస్తాయి. మాథర్ శృతి ఇలా పేర్కొంటున్నది:

పుణ్యేన పుణ్య లోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం

‘మంచి పనులు చేస్తే స్వర్గ లోకాలకు పోయెదవు; చెడు పనులు చేస్తే నరక లోకాలకు వెళ్ళెదవు; ఈ రెంటి మిశ్రమం చేస్తే మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చెదవు.’ ఏ విధంగా అయినా మనం కర్మ-ప్రతిఫల బంధాల్లో చిక్కుకుంటాము. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన మంచి ప్రతిఫలములను కలుగచేస్తాయి, అవి ఇంకా కర్మ రాశిని పెంచి, ఈ లోకంలో ఆనందం ఉన్నది అన్న భ్రమను మరింత పెంచుతాయి.

కానీ, స్వార్థ ప్రయోజనాలను విడిచిపెడ్తే, ఇక మన చర్యలు కర్మ-ఫలితాలని (కర్మ బంధాలని) సృష్టించవు. ఉదాహరణకు, హత్య చేయటం పాపం, మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దానిని ఒక దండించదగ్గ నేరంగా ప్రకటించింది. కానీ, ఒక పోలీసు, తన కర్తవ్య నిర్వహణలో బందిపోటు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్దంలో చంపితే, దానికి అతను శిక్షార్హుడు కాడు. నిజానికి అతని వీరత్వానికి ఒక పతకం కూడా ఇవ్వబడవచ్చు. ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కానీ, చెడు బుద్ధితో కానీ చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు; ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యముగా చేసినవి. భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా అన్నీ స్వార్థ ప్రయోజనాలను విడిచి, కర్మలను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే, అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు.

కాబట్టి, అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై, కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జయాపజయాలని, సుఖదుఃఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే, శత్రువులను సంహరించినా, అతనికి పాపం అంటదు. ఈ విషయం తదుపరి భగవద్గీత 5.10వ శ్లోకంలో కూడా మళ్లీ చెప్పబడింది: ‘తామరాకు నీటిచే తాకబడనట్టుగా, ఎవరైతే తమ కర్మలన్నిటినీ, మమకారము లేకుండా భగవదర్పితముగా చేస్తారో వారికి పాపము అంటదు.’

మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి, కర్మ శాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు.

Watch Swamiji Explain This Verse