దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।
దూరేణ — (త్యజించు) దూరము నుండే; హి — నిజముగా; అవరం — నిమ్న స్థాయి లోనున్న; కర్మ — ఫలాపేక్షతో చేసే పనులు; బుద్ధి-యోగాత్ — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి; ధనంజయ — అర్జునా; బుద్ధౌ — ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతర-దృష్టి; శరణం — ఆశ్రయం(శరణము); అన్విచ్ఛ — వెదుకుము; కృపణాః — లోభి/పిసినారి; ఫల-హేతవః — కర్మ ఫలములను ఆశించేవారు.
Translation
BG 2.49: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.
Commentary
పనికి రెండు దృష్టికోణాలున్నాయి: 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలుపంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే, ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్లడానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు, ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి, భగవత్ సేవ లాగా, 'కర సేవ' (స్వచ్చంద పని) చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసేపని ఒక్కటే అయినా, వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది.
ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ-భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసినవారు నిజమైన జ్ఞానం కలిగినవారు.
'కృపణ' (పిసినారి) అన్న పదం ఇక్కడ వాడబడింది. శ్రీమద్ భాగవతం, 'కృపణ' అంటే ఇలా నిర్వచించింది:
న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణ-వస్తు-దృక్
తస్య తాన్ ఇచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథా విధః (6.9.49)
‘భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యం అని అనుకునే వారే కృపణులు’. మరల శ్రీమద్భాగవతం ఇలా అంటుంది: “కృపణో యో ఽఅజితేంద్రియః’ (11.19.44) ‘ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు.’
ఒక వ్యక్తి విజ్ఞాన పై-స్థాయికి వెళ్ళే కొద్దీ, సహజంగానే కర్మ ఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి, సేవా దృక్పథం వైపు వెళతాడు. మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీత్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్, తన శక్తి సామర్ధ్యాలని సమాజ-సేవ లో వినియోగిస్తున్నాడు. అదే విధంగా, అమెరికా అధ్యక్షుడిగా తన హోదా, అధికారము పూర్తయిన తరువాత, బిల్ క్లింటన్, మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు, ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం ‘గివింగ్ — హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ (Giving — How Each Of Us Can Change The World.) కూడా రాసాడు. వారి సేవా దృక్పథం పొగడదగినదే, కానీ అది సరిగ్గా ఇంకా సరియైన దిశలో లేదు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం, భగవత్ అర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే, ఆ సేవా దృక్పథం లోప (దోష) రహితమవుతుంది.