Bhagavad Gita: Chapter 2, Verse 16

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।

న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.

Translation

BG 2.16: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.

Commentary

శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.

భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా

సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)


క్షరం ప్రధానమమృతాక్షరం హరః

క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)


సంయుక్తమేతత్ క్షరమక్షరం చ

వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)

 

ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.

1. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).

2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.

3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.

ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చాయి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?

ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.

సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స

తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా

తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్

నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం

చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం

కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)

 

భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.