Bhagavad Gita: Chapter 2, Verse 20

న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ।। 20 ।।

న జాయతే – జన్మించదు; మ్రియతే — మరణించదు; వా — లేదా; కదాచిత్ — ఎప్పుడైనా; న — కాదు; అయం — ఇది; భూత్వా — ఒకప్పుడు ఉండి; భవితా — భవిష్యత్తులో ఉండేది; వా — లేదా; న — కాదు; భూయః — ఇంకా; అజః — జన్మలేనిది; నిత్యః — నిత్యమైనది; శాశ్వతః — శాశ్వతమైనది; అయం — ఇది; పురాణః — సనాతనమైనది; న హన్యతే — నాశనం కానిది; హన్యమానే — నశించును; శరీరే — శరీరం ఎప్పుడైతే.

Translation

BG 2.20: ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.

Commentary

పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్త్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆ ప్రకారంగా, ఆరు రకముల మార్పులు దానికి లేవు - అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మరియు వినశ్యతి - ‘గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల, మరియు మరణించుట.’ ఇవి శరీరం యొక్క పరిణామాలు, ఆత్మకు వర్తించవు. మనము అనుకునే మరణం, కేవలం శరీర వినాశనం మాత్రమే, కానీ నిత్యమైన ఆత్మ, శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు. వేదాల్లో ఈ విషయాన్ని చాల సార్లు ప్రతిపాదించారు. కఠోపనిషత్తులో ఒక మంత్రం దాదాపు ఈ భగవద్గీత శ్లోకం లాగానే ఉంది.

న జాయతే మ్రియతే వా విపశ్చిన్

నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్

అజో నిత్యః శాశ్వతో ఽయం పురాణో

న హన్యతే హన్యమానే శరీరే (1.2.18)

 

‘ఆత్మకు పుట్టుక లేదు, దానికి మరణం లేదు; అది దేని నుండీ ఉద్భవించలేదు, ఏదీ కూడా దాని నుండి ఉద్భవించలేదు. అది జన్మలేనిది, సనాతనమైనది, నిత్యమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించినప్పుడు అది నశించదు.’ బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

స వా ఏష మహాన్ అజ ఆత్మాజరో ఽమరో ఽమృతో ఽభయః (4.4.25)

‘ఆత్మ మహిమాన్వితమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, వృద్ధాప్యము లేనిది, శాశ్వతమైనది మరియు భయరహితమైనది.’