Bhagavad Gita: Chapter 2, Verse 53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।

శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.

Translation

BG 2.53: కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.

Commentary

సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్ద ముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో, ఇలా అన్నాడు:

సంధ్యా వందన భద్రమస్తు భవతే

భోః స్నాన తుభ్యం నమః
భో దేవాః పితరశ్చతరపణ విధౌ

నహం క్షమః క్షమ్యతాం

యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్

తాస్య కంసద్విషః
స్మారం స్మారమఘం హరామి తదలం

మన్యే కిమన్యేన మే

‘అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి.’

శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాసలో ఉండే ధృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకంలో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ధి) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ది కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.

Watch Swamiji Explain This Verse