Bhagavad Gita: Chapter 2, Verse 41

వ్యవసాయాత్మికా బుద్దిరేకేహ కురునందన ।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।

వ్యవసాయ-ఆత్మికా — ధృఢమైన; బుద్ధిః — బుద్ది; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ది; అవ్యవసాయినామ్ — ధృడ సంకల్పం లేని.

Translation

BG 2.41: ఓ కురు వంశస్తుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ది ధృడంగా/స్థిరంగా ఉంటుంది, వారి లక్ష్యము ఒక్కటే. కానీ, స్థిరంగాలేని వారి బుద్ది పరిపరి విధములగా ఉంటుంది.

Commentary

మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార విషయాల వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయాలు, ప్రతిష్ఠ, శారీరిక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉండటం వలన అయిఉండవచ్చు. కానీ, అనుబంధం ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు మరి అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ది కి ఏమైనా పాత్ర ఉందా?

మన శరీరంలో సూక్ష్మ మైన 'అంతఃకరణ' ఉంటుంది. వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ది, అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రం లో 'బుద్ది' అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. 'బుద్ది' నిర్ణయాలు చేస్తుంది. మనస్సు కోరికలను సృష్టించి ఆ బుద్ది నిశ్చయించిన విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ 'బుద్ది' గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ బుద్ధి, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు కీర్తి, ప్రతిష్టల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి లో ఉన్న జ్ఞానం ప్రకారంగా మనస్సు కోరికలను కల్పిస్తుంది.

రోజంతా మనము మనస్సుని బుద్ది ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చునప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసు లో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ది నిర్ణయిస్తుంది. కాబట్టి బుద్ది అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధత తో ఆఫీసు లో కూర్చుంటాము. ఈ విధంగానే, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసు లో పని చేయటం అవసరం అని 'బుద్ది' నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ది మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని నియంత్రిస్తుంది, జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు.

మానవులగా మన బుద్ది కి మనస్సు ని నియంత్రించే సామర్థ్యం ఉంది అని ఈ పై ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. ఈ విధంగా, మనం సరైన విజ్ఞానం తో బుద్ది ని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సు కి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ది యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ఆనందం కోసమే అని ధృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండగలిగే కళ. అలాంటి ధృఢ సంకల్పం ఉన్నవాడు ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథం లో దూసుకెల్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, "ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో ఉన్నా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలి వేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను." అని. కానీ, ఎవరి బుద్ది పలు-విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంది. వారు ఈశ్వర పథం లో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.

Watch Swamiji Explain This Verse