Bhagavad Gita: Chapter 2, Verse 60

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।

యతతః — స్వీయ-నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు; హి — దానికి; ఆపి — కూడా; కౌంతేయ — అర్జునా , కుంతీ పుత్రుడా; పురుషస్య — పురుషుని యొక్క; విపశ్చితః — బుద్ధి విచక్షణ కలవారు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రమాథీని — అల్లకల్లోలమైన; హరంతి — లాక్కోనిపోవును; ప్రసభం — బలవంతంగా; మనః — మనస్సుని.

Translation

BG 2.60: ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.

Commentary

ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి, కాబట్టి వాటిని క్రమశిక్షణ లో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు, కామ క్రోధాదులతో కూడిన, విలాసాలను కోరే తమ ఇంద్రియములను మచ్చికచేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి, చెయ్యకపోతే అవి గొప్ప సహృదయులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు.

ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి, శ్రీమద్భాగవతంలో, ఒక చక్కని కథ ఉంది (9వ స్కందం, 6వ అధ్యాయం). పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదం లో పెర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.

ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు.

మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు "ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు!" అని. ఆ రాజు కి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, ముని అతనిని శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమర్తెలలొ ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు, "ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది". రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు.

సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళినప్పుడు , ఆ యాభై మందీ రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.

ఇప్పుడు, తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమో ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు: “అహో ఇమం పశ్యత మే వినాశం” (భాగవతం 9.6.50) "ఓ మానవులారా! భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీ లతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు."

Watch Swamiji Explain This Verse