Bhagavad Gita: Chapter 2, Verse 27

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।

జాతస్య — పుట్టినవానికి; హి — యేలనంటే; ధ్రువః — నిస్సందేహముగా; మృత్యుః — మరణము; ధ్రువం — తప్పదు; జన్మ — పుట్టుక; మృతస్య — మరణించినవానికి; చ — మరియు; తస్మాత్ — కాబట్టి; అపరిహార్యే అర్థే — ఈ తప్పని పరిస్థితిలో; న — కాదు; త్వం — నీవు; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.

Translation

BG 2.27: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.

Commentary

ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది, ‘యాజ్ ష్యూర్ యాజ్ డెత్’ (as sure as death) అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు: ‘జీవితంలో తప్పకుండా ఉండేవి, మరణం మరియు పన్నులు మాత్రమే’. (The only things certain in life are death and taxes.) జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనము ఏదో ఒకరోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. పతంజలి యొక్క 'యోగ్ దర్శన్' లో కూడా, అభినివేష్’ అంటే, ఎట్టి పరిస్థితిల్లో నైనా జీవించి ఉండాలనే స్వభావసిద్ధమైన లక్షణము, భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడినది. కానీ, జన్మించిన వానికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దాని కోసం శోకించటము ఎందుకు? మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది.

పాండవుల అరణ్యవాస సమయంలో, అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు. అందరికీ నీళ్ళు తెమ్మని భీముడిని పంపించాడు, యుధిష్ఠిరుడు. భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే, ఒక యక్షుడు (దేవతా జాతికి చెందిన వ్యక్తి) సరోవరం లోపల నుండి మాట్లాడటం మొదలు పెట్టాడు, ‘మొదట నా ప్రశ్నలకు సమాధానం చెపితేనే, నేను నీళ్ళు తీసుకోనిస్తాను.’ అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్ళు తాగటానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి గుంజేసాడు. కాసేపటి తరువాత భీముడు తిరిగి రాక పోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు, ఏమయిందో తెలుసుకొని, నీళ్ళు తెమ్మని ఆర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, ‘నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలన్నీటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీస్కోవడానికి ప్రయత్నించకు.’ అని. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేసాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు, సహదేవుడు కూడా వచ్చారు, వారికి కూడా ఇదే గతి పట్టింది.

చివరికి, యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు. మరల ఒకసారి ఆ యక్షుడు అన్నాడు, ‘నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళ లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను.’ అని. ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయానా, మారు వేషంలో ఉన్న మృత్యు దేవత అయిన యమధర్మరాజు. ఆయన అరవై ప్రశ్నలను అడిగాడు, వాటన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలలో ఒకటి : కిం ఆశ్చర్యం? ‘ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’ యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు:

అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం
శేషాః స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతః పరం

(మహాభారతం)

‘ప్రతి క్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనమూ చని పోతాము అని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది?’

జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే, కాబట్టి, తెలివైన వాడు అనివార్యమైన దానిని గూర్చి శోకించడు, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.

Watch Swamiji Explain This Verse