Bhagavad Gita: Chapter 2, Verse 62

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।

ధ్యాయతః — చింతన చేయుట; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — వాటి పట్ల (ఇంద్రియ విషయములు); ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజాయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.

Translation

BG 2.62: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.

Commentary

క్రోధం, లోభం, కామము, మొదలగునవి వైదిక వాఙ్మయంలో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటున్నది :

 

మానస్ రోగ కచ్చుక మై గాయే

హహిఁ సబ కేఁ లఖి బిరలేన్హ పాయే

 

ఈ శ్లోకం ఏం సూచిస్తోందంటే, మనకందరికీ శారీరక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు —ఏదో ఒక్క శారీరక జబ్బుకి కూడా మనిషిని రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది— కానీ మనము ప్రతి నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమౌతునట్టు మనకు తెలియట్లేదు. మనము కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మనస్తత్త్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం, అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ, పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి, మనస్సు యొక్క వాస్తవ తత్త్వవివరణకి, గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.

ఈ శ్లోకంలో ఇంకా తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఏదేని ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారనుకుందాం. ఒక రోజు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి యందు ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, ‘ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది’ అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సుకి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో, తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తుండటం వలన చదవలేక పోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలసి పని చేస్తున్నాము, మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని, అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్రని చెడగొట్టుకొని, ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే, అతను, ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదేపదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకారానుబంధం ఏర్పడింది.

ఇప్పుడు ఆ అనురాగం, దానిమటుకే అయితే అంత హానికరమేమీ కాదు అని అనిపిస్తుంది. కానీ, ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే తిరుగుతుంటుంది, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.

ఒకసారి కోరిక పుడితే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది - లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. ‘జిమి ప్రతిలాభ లోభ అధికాఈ’ (రామచరితమానస్) ‘కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారి తీస్తుంది.’ కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము:

యత్పృథివ్యామ్ వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః
న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే

(భాగవతం 9.19.13)

 

‘ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు, మరియు భోగ వస్తువులు లభించినా సరే, వ్యక్తి తృష్ణ చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని, తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి.’

మరోపక్క, కోరికలు తీర్చుకోవటంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపాన్ని కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికల నెరవేర్పుకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే చింతన చేయటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు-విషయముల మీద పదేపదే చింతన చేయటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, క్రోధము యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు.