Bhagavad Gita: Chapter 2, Verse 7

కార్పణ్యదోషో పహతస్వభావః
పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ।
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।। 7 ।।

కార్పణ్య-దోషా — పిరికితనము అనెడు దోషము; ఉపహత — ముట్టడి చేయబడి; స్వభావః — స్వభావము; పృచ్చామి — అడుగుతున్నాను; త్వాం — నిన్ను; ధర్మ — ధర్మమును; సమ్మూఢ — కలవరపడ్డ; చేతాః — చిత్తముతో; యత్ — ఏది; శ్రేయః — మంచిది; స్యాత్ — అగునో; నిశ్చితం — నిశ్చయముగా; బ్రూహి — తెలుపుము; తత్ — దానిని; మే — నాకు; శిష్యః — శిష్యుడను; తే — నీ యొక్క; అహం — నేను; శాధి — దయచేసి ఉపదేశం చేయుము; మాం — నేను; త్వాం — నీకు; ప్రపన్నమ్ — శరణాగతుడను.

Translation

BG 2.7: నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శేయస్కరమో దానిని ఉపదేశించుము.

Commentary

భగవద్గీతలో ఇదొక అత్యద్భుత ఘట్టం. శ్రీ కృష్ణుడి సఖుడు, బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్దిస్తున్నాడు. కార్పణ్య దోషం, అంటే, పిరికితనం వలన ప్రవర్తన లో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని, భగవంతుడిని తన గురువు గా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని, అర్జునుడు శ్రీ కృష్ణుడిని బ్రతిమాలుతున్నాడు.

ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని, సమస్త వైదిక గ్రంధాలు ఏకకంఠం తో చెప్తున్నాయి.

తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బహ్మనిష్ఠమ్
(ముండకోపనిషత్తు 1.2.12)

"పరమ సత్యాన్ని తెలుసుకోడానికి, వైదిక వాఙ్మయం తెలిసినవాడు, ఆచరణాత్మకంగా భాగవత్ప్రాప్తి నొందిన గురువుని ఆశ్రయించాలి"

తస్మాద్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః  శ్రేయ ఉత్తమమ్
శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్
 (భాగవతం 11.3.21)

 

"సత్యాన్ని అన్వేషించేవారు - ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి చేయాలి, ఆయన ప్రాపంచికత్వాన్ని పక్కన బెట్టి, వేదాంతాన్ని అర్థం చేసుకుని, సంపూర్ణంగా భగవంతుడినే ఆశ్రయించినవాడై ఉండాలి."

రామాయణం (తులసీదాసు గారి రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:

“గురు బిను భవ నిధి తరఇ న కోఈ, జో బిరంచి శంకర సమ హోఈ”

"ఆధ్యాత్మికతని అన్వేషించేవారు ఎంత ఉన్నత స్థాయి గొప్ప వారయినా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు". శ్రీ కృష్ణుడు తనే స్వయంగా భగవద్గీత లో 4.34వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు: "ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి పరమ సత్యాన్ని తెలుసుకోండి. పూజ్యభావం తో ప్రశ్నించి మరియు వారికి సేవ చేయండి. అలాంటి సత్పురుషుడైన జ్ఞాని మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు."

జ్ఞాన సమపార్జన చేయటానికి గురువు యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి, స్వయంగా శ్రీ కృష్ణుడే ఆ పని చేసాడు. తన యౌవ్వనంలో, అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోడానికి, సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళాడు. కృష్ణుడి సహ విద్యార్థి సుదాముడు ఈ విషయంలో ఈ విధంగా అన్నాడు.

యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో
శ్రేయసాం తస్య గురుషు వాసోఽత్యంత విడంబనం
(భాగవతం 10.80.45)

"ఓ శ్రీ కృష్ణా, వేదములు నీ శరీరము వంటివి, అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి (కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది ?). అయినా నువ్వు కూడా గురువు దగ్గర నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే. " శ్రీ కృష్ణుడు నిజానికి ప్రధమ జగద్గురువు, ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో మొదట జన్మించిన బ్రహ్మ దేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మ లకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరము ఉంటుంది, అని, తన ఉదాహరణ తో చెప్పటానికి, ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చెసాడు. ఈ శ్లోకం లో అర్జునుడు, ఒక శిష్యుడిగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరియైన దిశానిర్దేశము కొరకు, జ్ఞానోపదేశం చేయమని ప్రార్ధిస్తున్నాడు.