Bhagavad Gita: Chapter 2, Verse 55

శ్రీ భగవానువాచ ।
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।

శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను; ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి); యదా — ఎప్పుడైతే; కామాన్ — స్వార్ధ కోరికలు; సర్వాన్ — అన్నీ; పార్థ — అర్జునుడా, ప్రిథ తనయుడా; మనః-గతాన్ — మనస్సు యొక్క; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — మాత్రమే; ఆత్మనా — పరిశుద్ధ మనస్సు తో; తుష్టః — సంతుష్టుడై; స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు ; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.

Translation

BG 2.55: భగవానుడు పలికెను : ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్ధ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానం లో సంతుష్టుడు అయినప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.

Commentary

శ్రీ కృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పటం ఇక్కడ నుండి మొదలుపెట్టి, ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు. ఒక రాయి, భూమి వైపు గురుత్వాకర్షణ శక్తి చే గుంజబడినట్టు, ప్రతి 'అంశ' సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశ. అంటే, జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క అంశ, అందుకే అది సహజం గానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించటానికి కృషి చేసినప్పుడు, దానిని "దివ్య ప్రేమ" అని అంటారు. కానీ, తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి, తనను తాను శరీరమే అనుకుని, జగత్తు నుండి శారీరిక ఆనందాన్నిఆస్వాదించటానికి ప్రయత్నించినప్పుడు దానిని ''కామము'' అంటారు.

ఈ ప్రపంచం 'మృగ తృష్ణా' అని ఆగమ గ్రంధాలలో చెప్పబడింది, అంటే 'జింకలకు అగుపించే ఎండ మావి' అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంటుంది. దాని అల్ప బుద్ది తను ఒక భ్రాంతి కోసం పరుగిడుతున్నట్టు తెలుసోకోలేదు. ఆ దీనమైన జింక, లేని నీటి కోసం వెంటపడుతూ చివరికి నీరసం తో ఆ ఎడారి ఇసుక పై మరణిస్తుంది. ఈ విధంగానే, భౌతిక శక్తి అయిన 'మాయ' కూడా ఆనందం అనే భ్రాంతి ని కలుగచేస్తుంది, మనం ఆ మాయా ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి పరుగులు పెడుతున్నాము. కానీ, మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మననుండి దూరమయిపోతున్నది. గరుడ పురాణం ఇలా పేర్కొంటున్నది.

చక్రధరోఽపి సురత్వం సురత్వలాభే సకలసురపతిత్వం
భవ్తిరుం సురపతిరూర్ధ్వగతిత్వం తథాపి ననివర్తతే తృష్ణ (2.12.14)

"ఒక రాజు, ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు; చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు; ఒక దేవత, స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు, సృష్టికర్త బ్రహ్మ దేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా, భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ, తృప్తితీరదు"

కానీ, మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయటం తెలిసికొని, ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి, తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ, స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు మరింత ముందుకెళ్ళి, ఆశ/కోరికలను త్యజించినవాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటున్నది.

యదా సర్వే ప్రముచ్యంతే కామాయేఽస్య హృది శ్రితాః
అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే (2.3.14)

"హృదయం నుండి అన్ని స్వార్ధ కోరికలు తొలగించిన పిదప, భౌతిక సంకెళ్ళు వేయబడ్డ జీవాత్మ, జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములలో దేవుని వలె అవుతుంది." స్థిత-ప్రజ్ఞుడు అంటే, అన్ని స్వార్ధ కోరికలను, ఇంద్రియ లౌల్యములను త్యజించి, ఆత్మ యందే సంతుష్టి నొందినవాడు అని శ్రీ కృష్ణుడు ఈ పై శ్లోకం లో వ్యక్తీకరించాడు.

Watch Swamiji Explain This Verse