అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ ।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ।। 17 ।।
అవినాశి — నాశముచేయరాని; తు — నిజముగా; తత్ — అది; విద్ధి — తెలుసుకొనుము; యేన — ఎవరిచేతనైతే; సర్వం — అంతయు; ఇదం — ఇది; తతమ్ — వ్యాప్తి నొంది ఉన్నదో; వినాశమ్ — వినాశము; అవ్యయస్య — అనశ్వరమైన, నిత్యమైన దాని; అస్య — యొక్క; న కశ్చిత్ — ఎవ్వడూ కాడు; కర్తుమ్ — చేయటానికి; అర్హతి — సమర్థుడు.
Translation
BG 2.17: శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనంచేయలేరు.
Commentary
ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా, శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీ కృష్ణుడు. అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటి? ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడ పదార్థంచే తయారుచేయబడినది, చైతన్య రహితమైనది. కానీ, ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా, ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపచేస్తుంది.
కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి. ఆత్మ, హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి:
హృది హ్యేష ఆత్మా (ప్రశ్నోపనిషత్తు 3.6)
స వా ఏష ఆత్మా హృది (ఛాందోగ్య ఉపనిషత్తు 8.3.3)
'హృది' అన్న పదం, ఆత్మ హృదయ ప్రాంతంలో స్థితమై ఉంటుందని సూచిస్తున్నది. అయినా, ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యము, శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? వేద వ్యాసుడు ఈ విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు:
అవిరోధశ్చందనవత్ (బ్రహ్మ సూత్రములు 2.3.23)
‘ఎలాగైతే లలాటము (నుదురు) పై చందనం అద్దితే, శరీరమంతా చల్లబడి పోతుందో, అదేవిధంగా, ఆత్మ, స్థానికంగా హృదయంలో ఉన్నా తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది.’
ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు - చైతన్యమనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలోన ఎట్లా వ్యాపించింది? అని. ఈ ప్రశ్నకి కూడా వేద వ్యాసుడు సమాధానం చెప్పాడు:
వ్యక్తిరేకో గంధవత్ (బ్రహ్మ సూత్రములు 2.3.26)
‘సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం. కానీ, అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది.’ అంటే, పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది. అదేవిధంగా, ఆత్మ సచేతనమైనది, అది జీవం లేని జడ శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది.