Bhagavad Gita: Chapter 2, Verse 64

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।

రాగ — మమకారము/అనురక్తి; ద్వేష — ద్వేషము; వియుక్తైః — లేకుండా; తు — కానీ; విషయాన్ — ఇంద్రియ విషయములు; ఇంద్రియైః — ఇంద్రియములచే; చరన్ — వాడుతున్ననూ; ఆత్మ-వశ్యైః — మనస్సుని అదుపు చేస్తూ; విధేయ-ఆత్మా — మనస్సుని నియంత్రణ చేయువానికి; ప్రసాదం — భగవత్ కృప; అధిగచ్ఛతి — లభించును.

Translation

BG 2.64: ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.

Commentary

వినాశనానికి దారి తీసే అధోపతనమంతా ఇంద్రియ వస్తు-విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు, దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. ‘నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను’ అని అనుకోవటం అసంభవం, ఎందుకంటే అది ఆత్మకి అసహజము. అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపు పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు; పైగా అది శుద్ధి చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు, మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమౌతుంది.

ఈ విధంగా, శ్రీ కృష్ణుడు మనలను కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు, అతను భౌతిక/ప్రాపంచిక మమకారాన్ని, కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక (ఈశ్వరసంబంధమైన) మమకారం, కోరికలు త్యజించకూడదు, నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవటం, పెంచుకోవటం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణ అంత శుద్ధి అవుతుంది. నిర్గుణ, నిరాకర అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనని ప్రతిపాదించే జ్ఞానులు, అన్ని మమకార-బంధాలను త్యజించమని చెప్పినప్పుడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ‘ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సుని నాయందే ఉంచుతారో, వారు మూడు ప్రకృతి గుణములకు అతీతులై, పరబ్రహ్మ స్థాయిని చేరుకుంటారు.’ (భగవద్గీత 14.26). శ్రీకృష్ణుడు పదేపదే అర్జునుడిని తన మనస్సుని భగవంతుని యందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో (శ్లోకం 8.7, 8.14, 9.22, 9.34, 10.10, 11.54, 12.8, 18.55, 18.58, మరియు 18.65 మొదలగునవి ) విజ్ఞప్తి చేయుచున్నాడు.

రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా జ్ఞప్తికి వస్తుందో, అదే విధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగ చేస్తాయి-అవి దాన్ని మైల పరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి, అది భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు, వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆయొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా, మరియు చూస్తున్నా, స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.

Watch Swamiji Explain This Verse