Bhagavad Gita: Chapter 2, Verse 54

అర్జున ఉవాచ ।
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ।। 54 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; స్థితప్రజ్ఞస్య — స్థిరమైన బుద్ది కలవాడు; కా — ఏమి? భాషా — మాట్లాడును; సమాధి-స్థస్య — భగవత్ ధ్యాస లో ఉండి; కేశవ — శ్రీ కృష్ణ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా; స్థిత-ధీః — జ్ఞాని; కిం — ఏమిటి? ప్రభాషేత — మాట్లాడును; కిం — ఎలా? ఆసీత — కూర్చుండును; వ్రజేత — నడుచును? కిం — ఎలా?

Translation

BG 2.54: అర్జునుడు పలికెను : ఓ కేశవా, భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న (స్థితప్రజ్ఞుని) వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చొనును? అతను ఎలా నడుచును?

Commentary

'స్థిత-ప్రజ్ఞ' (స్థిర బుద్ధి కలవాడు), 'సమాధి-స్థ' (ధ్యానంలోనే నిమగ్నమైనవాడు) అన్న బిరుదునామాలు జ్ఞానోదయం అయిన వారికి వర్తిస్తాయి. శ్రీ కృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి (సమాధి) గురించి విన్న తరువాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి, ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు.

ఈ శ్లోకం తో మొదలిడి అర్జునుడు శ్రీ కృష్ణుడిని పదహారు ప్రశ్నలు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, తపస్సు, ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములను తెలియపరుస్తాడు. ఆ పదహారు ప్రశ్నలు ఇవే:

1. “భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్నవాని ప్రవృత్తి ఎలా ఉంటుంది?” (శ్లోకం 2.54)

2.” సకామ కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్ఠ మన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు ? “(శ్లోకం 3.1)

3. “ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఎవరో చేపించినట్టుగా, పాపిష్టి పనులను చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు?” (శ్లోకం 3.36)

4. “వివస్వనుడి తరువాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరి అతనికి మొదట్లో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేనెలా అర్థం చేసుకోవాలి?” (శ్లోకం 4.4)

5.” కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు, మళ్లీ భక్తి తో పని చేయటాన్ని కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెంటిలో ఏది శ్రేష్ఠమయినదో నిర్ణయాత్మకంగా చెప్పుము?” (శ్లోకం 5.1)

6. “ఓ కృష్ణా, మనస్సు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, ధృఢమైనది, మొండిది. దీనిని నిగ్రహించుట వీచేగాలిని నిరోధించటం కన్నా కష్టమని అనిపిస్తున్నది.” (శ్లోకం 6.33)

7. “ఈ మార్గం లో విశ్వాసంతో బయలుదేరినా, నిగ్రహించబడని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయి, ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక, విజయవంతం కాలేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి?” (శ్లోకం 6.37)

8. “బ్రహ్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి ? అధిభూత అంటే ఏమిటి ? ఆధిదైవం అంటే ఎవరు ? ఆధియజ్ఞ అంటే ఎవరు, తను ఈ శరీరం లో ఎలా ఉంటాడు ? ఓ, మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా, ధృడ సంకల్పం కల వారు మరణ సమయంలో నీతో ఎలా ఏక మవుతాడు ? “(శ్లోకం 8.1-2)

9. “సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే, నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యము గురించి తెలియ పరుచుము.” (శ్లోకం 10.16)

10. “నీ విశ్వ రూపం చూడ గోరుతున్నాను, ఓ పరమ పురుషా. “(శ్లోకం 11.3)

11. “సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే, అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను, నీ తత్త్వం, కార్యములు నన్ను సమ్మోహితున్ని చేస్తున్నాయి. “(శ్లోకం 11.31)

12. “నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మాం ను ఆరాధించేవారిలో ఎవరు యోగం లో ఎక్కువ శ్రేష్ఠులు?” (శ్లోకం 12.1)

13.” ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు ? జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞాన విషయం ఏమిటి ?” (శ్లోకం 13.1)

14. “త్రిగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి? వారు ఎలా ప్రవర్తిస్తారు ? వారు ఎలా త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు ?” (శ్లోకం 14.21)

15. “వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా (కానీ) భక్తి తో పూజించే వారి పరిస్థితి ఏమిటి?” (శ్లోకం 17.1)

16. “సన్యాసం అంటే ఏమిటి, అది త్యాగం (కర్మ ఫలాలని త్యజించటం) కంటే ఎలా వేరైనది?” (శ్లోకం 18.1)

Watch Swamiji Explain This Verse