యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58 ।।
యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములు; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ వస్తు-విషయముల నుండి; తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.
Translation
BG 2.58: తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.
Commentary
ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు, విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించటం అనేది నేతిని పోసి మంటను ఆపటానికి ప్రయత్నించటం వంటిది. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా, రెండింతల ఉదృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి, కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు; అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి, అని శ్రీమద్భాగవతం పేర్కొంటున్నది:
న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి ।
హవిషా కృష్ణ-వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే (9.19.14)
‘ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల, అగ్ని ఆరిపోకపోవటమే కాక, ఇంకా ఎక్కువ ఎగసి పడుతుందో, ఇంద్రియ వాంఛలను తీర్చటం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు.’
ఈ కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు. దురద చాలా అసౌకర్యంగా ఉండి, గోక్కోవాలనే తీవ్ర వాంఛను కలుగ చేస్తుంది. కానీ, గోకటం సమస్యని పరిష్కరించదు. కొద్ది సమయం పాటు ఉపశమనం ఉన్నా, మళ్లీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది. దీనికి బదులుగా, దురదను కొంచెం సేపు సహించగలిగితే, దాని పోటు తరిగిపోయి, క్రమంగా క్షీణించిపోతుంది. దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే. ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేకానేక వాంఛలను కోరుతాయి, మనము వాటిని నెఱవేర్చుతూ ఉన్నంతవరకూ నిజమైన ఆనందం, ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది. కానీ, మనం ఆ కోరికలన్నిటినీ త్యజించటం నేర్చుకుని, భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే, మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి.
కాబట్టి, జ్ఞానోదయమైన ముని, వివేకముతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను, తలను లోపలికి తీస్కొని తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత, తన అంగములను, తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమయిన జీవాత్మ, మనస్సు, ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి, పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది.