దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।
దుఃఖేషు — దుఃఖముల నడుమ; అనుద్విగ్న-మనాః — మనస్సులో ఉద్వేగమునకు లోను కాని వాడు; సుఖేషు — సుఖములలో; విగత స్పృహః — పొంగిపోని వాడు; వీత — లేకుండా; రాగ — మమకారం; భయ — భయము; క్రోధః — కోపము; స్థిత-ధీః — జ్ఞానోదయం అయినవాడు; మునిః — ముని; ఉచ్యతే — అనబడును.
Translation
BG 2.56: దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.
Commentary
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, స్థిత-ప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు : 1) వీత రాగ - సుఖములకోసం ప్రాకులాడుట విడిచిపెడతారు, 2) వీత భయ - వారు భయ రహితులు, 3) వీత క్రోధ - వారికి కోపము ఉండదు.
జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన, కామము, క్రోధం, లోభం, ఈర్ష్య, మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలని రానివ్వడు. అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వం పై చింతన మరియు భగవత్ ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతినిస్తే, భగవత్ ధ్యాస ఆగిపోయి, ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా, పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు ఈ రెంటినీ వదిలి వేసి, ప్రస్తుత వేదనని తట్టుకొవటానికి ప్రయత్నిస్తే, బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో, బౌద్ధ సన్యాసులు, ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు.
ఇదే విధంగా, బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవత్ ధ్యాస నుండి పక్కకు పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకా, అటువంటి యోగి, భయము, కోపము వంటి భావోద్వేగాలకి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.